Begin typing your search above and press return to search.

హుజురాబాద్ లో వంద మంది నిఘా అధికారుల్ని దించారా?

By:  Tupaki Desk   |   1 July 2021 6:30 AM GMT
హుజురాబాద్ లో వంద మంది నిఘా అధికారుల్ని దించారా?
X
మాజీ మంత్రి.. ఈ మధ్యనే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ నాయకత్వం మీద విమర్శలు సంధించారే కానీ.. అవేమీ ఘాటైనవి కావు. ఇదిలా ఉంటే తాజాగా ఇంటలిజెన్స్ ఉన్నతాధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన రాజీనామాతో త్వరలోనే హూజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న వేళ.. నియోజకవర్గంలోని రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పనులు చేస్తున్నారన్నారు.

అంతేకాదు..తెలంగాణ నిఘా విభాగంలో డీఐజీగా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావుపై ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి అనుగుణంగా ఆ డీఐజీ పని చేస్తున్నారా? లేదంటే సీఎం కేసీఆర్ కు చుట్టంగా పని చేస్తున్నావా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్దితోపాటు ప్రత్యర్థి వర్గాల కదలికలు, అధికార వినియోగం..లాంటి అంశాల మీద ఫోకస్ పెట్టి.. నిఘాను మరింత పెంచినట్లుగా ఆరోపిస్తున్నారు.

తన వర్గానికి చెందిన వారిని నిఘా వర్గాలు నీడలా వెంటాడుతున్నాయని మండిపడ్డారు. ఈటల మాత్రమే కాదు.. ఆయన సతీమణి జమున కూడా తనను ఫాలో అవుతున్న నిఘా వర్గాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఇంటలిజెన్స్ డీఐజీపై మండిపడ్డారు. హుజూరాబాద్ లో వంద మంది నిఘా అధికారుల్ని దించారని.. వారి చేత ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేయాల్సి వస్తే.. పార్టీ జెండాలు కప్పుకొని పని చేయాలే కానీ.. ఇలా చేస్తారా? అంటూ కడిగిపారేశారు.ఇప్పుడు జరుగుతున్న వాటన్నింటికి ఎన్నికల వేళ.. ప్రజలు బదులు తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.