Begin typing your search above and press return to search.

మూణ్నెళ్లలో వంద మందికిపైగా ఉరిశిక్ష...!

By:  Tupaki Desk   |   22 Jun 2022 2:30 PM GMT
మూణ్నెళ్లలో వంద మందికిపైగా ఉరిశిక్ష...!
X
సాధారణంగా నేరాలకు అడ్డుకట్ట వేయడానికి.. మళ్లీ తప్పు చేయాలంటే నేరస్థుల్లో భయం పుట్టాలనే ఉద్దేశంతో శిక్షలు వేస్తారు. కొన్ని దేశాల్లో ఈ శిక్షలు సాధారణంగా ఉంటే.. మరికొన్ని దేశాల్లో మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఇరాన్ వంటి దేశాల్లో అయితే శిక్షలు ఊహకు అందవు. అక్కడ చిన్న తప్పు చేసినా.. కఠినాతికఠినమైన శిక్షలుంటాయి. అందుకే ఆ దేశంలో ప్రతి ఏటా నమోదయ్యే మరణశిక్షల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే వంద మందికి పైగా మరణ శిక్ష అమలు చేశారు.

వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది భారత న్యాయవ్యవస్థ నినాదం. అందుకే ఇక్కడ బడా బడా నేరాలు చేసిన వాళ్లు కూడా చాలాసార్లు ఈజీగా తప్పించుకుంటున్నారు. కానీ ఇరాన్ దేశంలో అలా కాదు. అక్కడ చిన్న తప్పు చేసినా కఠిన శిక్షలుంటాయి. ఆ దేశంలో మరణశిక్షలు ఎక్కువగా విధిస్తారు. మైనర్లకు కూడా మరణశిక్షలుంటాయంటే అక్కడ ఆంక్షలు, శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ దేశంలో ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే వంద మందికిపైగా వ్యక్తులను ఉరి తీశారు. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి మార్చి 20వతేదీల మధ్య మూడు నెలల్లో 105 మందికి మరణ శిక్షలు అమలు చేశారని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది.

మరణ శిక్షకు గురైన వారిలో ఎక్కువగా మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారని తాజా నివేదిక తెలిపింది. జెనీవాలోని యూఎన్ మానవ హక్కుల మండలిలో మానవ హక్కుల డిప్యూటీ చీఫ్ నాడా అల్-నషిఫ్ ఇరాన్‌పై ఈ నివేదికను విడుదల చేశారు.

2020వ సంవత్సరంలో 260 మంది వ్యక్తులకు మరణశిక్ష విధించగా, 2021లో కనీసం 14 మంది మహిళలతో సహా 310 మంది వ్యక్తులను ఉరి తీశారని నాడా అల్-నషిఫ్ చెప్పారు. ఈ సంవత్సరం కూడా అదే ట్రెండ్ కొనసాగిందని.. జనవరి 1, మార్చి 20 తేదీల మధ్య 105 మందికి మరణశిక్ష విధించారని పేర్కొంది.

మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలతో సహా చిన్న నేరాలకు ఉరిశిక్షలు వేయడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై 52 మందిని ఉరిశిక్ష కోసం షిరాజ్ జైలుకు తరలించినట్లు నషిఫ్ చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ బాల నేరస్థులకు మరణ శిక్ష వేయడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మైనర్‌ నేరాల కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించారు. 85 కంటే ఎక్కువ బాల నేరస్థులు మరణశిక్షకు గురయ్యారని ఆమె చెప్పారు.