Begin typing your search above and press return to search.

మ‌ర‌ణానికి వీలునామా రాసే హ‌క్కు ఇచ్చేసిన సుప్రీం!

By:  Tupaki Desk   |   10 March 2018 4:37 AM GMT
మ‌ర‌ణానికి వీలునామా రాసే హ‌క్కు ఇచ్చేసిన సుప్రీం!
X
ఎన్ని మందులు వాడినా.. ఎంత ప్ర‌య‌త్నం చేసినా.. మంచాన ప‌డి పైకి లేవ‌లేని ప‌రిస్థితి. బ‌తికే ఆరాటంలో అనుక్ష‌ణం న‌ర‌కం అనుభ‌వించాలా? ఇలాంటి బ‌తుకు అవ‌స‌ర‌మా? ప్లీజ్.. మ‌న‌స్ఫూర్తిగా చెబుతున్నా.. ఇక బ‌తకాల‌న్న ఆశ లేదు. అనుక్ష‌ణం ఈ న‌ర‌క‌యాత‌న ప‌డ‌లేను.. ద‌య‌చేసి.. నాకు మ‌ర‌ణాన్ని ప్ర‌సాదించండంటూ కొంద‌రు రోగులు కోరుతుంటారు. నో.. నీకు స‌హ‌జ సిద్ధంగా చావు వ‌చ్చే వ‌ర‌కూ బ‌తికి చావాల్సిందేన‌ని తేల్చి చెబుతుంది చ‌ట్టం. మ‌రి.. అలాంటి చ‌ట్టాన్ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేదా?

న‌యం కాని వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి.. ఎప్ప‌టికి కోలుకోలేని ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు.. బ‌త‌కాల‌న్న ఆశ లేన‌ప్పుడు.. త‌దుప‌రి చికిత్స అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పిన‌ప్పుడు.. వారు కోరుకున్న రీతిలో మ‌ర‌ణాన్ని ఎంపిక చేసుకునే హక్కు మ‌నిషికి ఉండ‌దా? అన్న ప్ర‌శ్న‌కు సుప్రీం త‌న సంచ‌ల‌న తీర్పును చెప్పింది.

రోగి త‌న మ‌ర‌ణ వీలునామాను తానే రాసుకునే స్వేచ్ఛ‌ను ఇచ్చింది. కారుణ్య మ‌ర‌ణంపై సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన కోర్టు.. అందుకు ప‌టిష్ట‌మైన నియ‌మావ‌ళిని పేర్కొంది కూడా. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం శుక్ర‌వారం సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. కారుణ్య మ‌ర‌ణంపై బెంచ్ లోని న్యాయ‌మూర్తులు ఎవ‌రి అభిప్రాయం వారు చెప్పినా..ప‌రోక్ష కారుణ్య మ‌ర‌ణంపై అంతిమ నిర్ణ‌యం విష‌యంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

జీవించే హక్కులో మరణించే హక్కు భాగమే’ అని 1996లోనే రాజ్యాంగ ధర్మాసనం జ్ఞాన్‌కౌర్‌ కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే.. దీనిపై కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని.. మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛ ంద సంస్థ ఒక పిల్‌ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘంగా విచారించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా కీల‌క తీర్పును ఇచ్చింది. త‌మ మ‌ర‌ణానికి సంబంధించి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని చెబుతూ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని రూపొందించిన సుప్రీం.. ఈ అంశంపై పార్ల‌మెంటు చ‌ట్టం చేసే వ‌ర‌కు అమ‌ల్లోఉంటుంద‌ని పేర్కొంది.

కారుణ్య మ‌ర‌ణానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. వారి అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సుప్రీం.. ఈ అంశంపై చ‌ట్టం రూపొందించాల్సిన అవ‌స‌రాన్ని వెల్ల‌డించింది. ఎలాంటి చికిత్స చేసినా.. రోగి కోలుకోలేని ప‌రిస్థితుల్లో త‌న మ‌ర‌ణ‌వీలునామా రాయ‌న‌ప్ప‌టికీ కుటుంబ స‌భ్యుల విన్నపం మేర‌కు మ‌ర‌ణాన్ని ప్ర‌సాదించేలా తీర్పును ఇచ్చింది. దీనిపై సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాలు చూస్తే..

+ మాన‌సిక ఆరోగ్యంతో రాసిన మ‌ర‌ణ వీలునామాల్ని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

+ తాను రాస్తున్న వీలునామాపై పూర్తి అవ‌గాహ‌న‌తో ఉన్న‌దే ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

+ తాను రాస్తున్న‌ది ఎందుక‌న్న స్ప‌ష్ట‌త రోగికి త‌ప్ప‌క ఉండాలి. ఆ విష‌యాన్ని వ్య‌క్త‌ప‌ర‌చాలి కూడా.

+ ఎప్పుడు.. ఎలాంటి ప‌రిస్థితుల్లో త‌న‌కు వైద్యం నిలిపివేయాలో కూడా స్ప‌ష్టంగా వెల్ల‌డించాలి

+ వీలునామా రాసినా..కీల‌క స‌మ‌యానికి రోగి త‌న నిర్ణ‌యాన్ని తీసుకోలేకుంటే.. ప్రాణాధార వ్య‌వ‌స్థ‌ల్ని ఎవ‌రు నిలిపి వేయాల‌న్న విష‌యాన్ని పేర్కొన‌టంతోపాటు.. ఎవ‌రి మాట‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకోవాలో చెబుతూ.. వారితో త‌న‌కున్న అనుబంధాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.

+ మ‌ర‌ణ వీలునామాను ఇద్ద‌రు సాక్షుల స‌మ‌క్షంలో రోగి సంత‌కం చేయాలి. జ్యూడీషియ‌ల్ మెజిస్ట్రేట్ దీనిపై కౌంట‌ర్ సిగ్నేచ‌ర్ చేసి.. వీలునామాను డిజిట‌ల్ కాపీని త‌న ద‌గ్గ‌ర అట్టి పెట్టాలి

+ రోగి వీలునామా అమ‌లుపై సంబంధిత ఆసుప‌త్రి ఒక మెడిక‌ల్ బోర్డును ఏర్పాటు చేసి.. అందులో ప‌లు విభాగాల‌కు చెందిన వైద్యులు క‌నీసం ముగ్గురు నిపుణులు ఉండాల్సిందే. వీరికి క‌నీసం 20 ఏళ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. మ‌ర‌ణ వీలునామా అమ‌లు విష‌యంలో రోగి అర్హుడన్న విష‌యంతో పాటు.. ఎంత వైద్యం చేసినా కోలుకునే అవ‌కాశం లేద‌న్న విష‌యాన్ని మెజిస్ట్రేట్ నిర్ధారించుకున్న త‌ర్వాతే రోగి మ‌ర‌ణానికి అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది.