Begin typing your search above and press return to search.

వెండి నాణేల వర్షం ..ఎగబడిన జనం, ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   23 May 2020 10:50 AM GMT
వెండి నాణేల వర్షం ..ఎగబడిన జనం, ఎక్కడంటే !
X
సాధారణంగా మనం వడగళ్ల వర్షం కురిసింది అని ఎక్కువగా వింటుంటాం. అప్పుడప్పుడు చేపల వర్షం కురిసింది అని కూడా మనం వింటూనే ఉంటాం. కానీ , తాజాగా వెండి నాణేల వర్షం కురిసింది. దీనితో స్థానిక ప్రజలు ఆ నాణేల కోసం ఎగబడ్డారు. ఇంతకీ ఈ వెండి నాణేల వర్షం ఎక్కడ కురిసింది అంటే ..తూర్పుగోదావరి జిల్లా సాగర తీరంలో ఈ వెండి నాణేల వర్షం కురిసింది.

దీనిపై పూర్తి వివరాలు చూస్తే .. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయి. ఉప్పాడ కొత్తపల్లిలో కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయి. అలల తాకిడికి కొన్ని ఇళ్లు సైతం కొట్టుకుపోయాయి. సుమారు ఎనిమిది ఇళ్ల వరకు నేలమట్టమయ్యాయి. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కూలిన ఇంటి గోడల్లో నుంచి వెండి నాణేలు రాలిపడ్డాయి. ఓ ఇంటి పునాది గోడ కూలడంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి.

ఈ నాణేలు బ్రిటిష్‌ కాలం నాటివిగా తెలుస్తోంది. ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు తీరంలో వెతుకులాట ప్రారంభించారు.పెద్దఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు.. పూర్వం బొందు అమ్మోరయ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబానికి చెందిన వారు ధనవంతులని ప్రచారం కూడా జరుగుతోంది. ఆ క్రమంలోనే వారు ఇంటి గోడలో ఈ వెండి నాణేలు దాచిపెట్టారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున వెండి నాణేలను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే,ఈ విషయాన్ని మాత్రం ఈ ప్రాంత వాసులు గోప్యంగా ఉంచుతున్నారు. వెండి నాణేలు దొరికిన విషయం తెలిస్తే పురావస్తు శాఖ అధికారులు తీసుకెళ్లిపోతారోననే భయంతో స్థానికులు నోరు విప్పడంలేదు.