Begin typing your search above and press return to search.

కిష్కిందకాండ.. హనుమ జన్మస్థలంపై టీటీడీకి మరో షాక్

By:  Tupaki Desk   |   14 May 2021 12:00 PM IST
కిష్కిందకాండ.. హనుమ జన్మస్థలంపై టీటీడీకి మరో షాక్
X
పురాణాలకు పరిమితమైన వారి గురించి ఏదైనా ధార్మిక సంస్థ ప్రకటన చేయటానికి ముందు.. దానిపై పని చేసే వారందరితో సమాలోచనలు జరపటం.. ఉమ్మడి నిర్ణయాన్ని ప్రకటించటం చేయాలి. అందుకు భిన్నంగా ఎవరి పంచాయితీ వారిదన్నట్లుగా వ్యవహరిస్తే లేనిపోని తిప్పలు తప్పించి మరింకేమీ ఉండదు. హనుమంతుని జన్మస్థలిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల కొత్త సిద్దాంతానని సూత్రీకరించటం.. అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలిగా పేర్కొనటం తెలిసిందే. ఇందుకోసం తామెంతో పరిశోధన చేసినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. హనుమంతుని జన్మస్థలిపై టీటీడీ వాదనకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. టీటీడీ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. కర్ణాటకలోని కిష్కంధ హనుమద్ జన్మభైమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త గోవిందానంద సరస్వతి స్వామి స్పందించారు. టీటీడీకి ఆయనో ఘాటు లేఖను పంపారు.

హనుమంతుని జన్మస్థలంపై టీటీడీ సమర్పించిన నివేదిక పూర్తిగా తప్పు అని.. అవాస్తవమని తేల్చారు. పురాణాలు.. ఇతిహాసాల్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని.. అసత్యాల్ని సత్యాలుగా చూపేందుకు టీటీడీ అధికారుల శ్రమను చూస్తుంటే తమకు జాలివేస్తుందని మండిపడ్డారు.

ఈ లేఖపై టీటీడీ స్పందించి.. చర్చకు 10 - 20 రోజుల సమయాన్ని కోరింది. దీనిపై ట్రస్టు మరోసారి స్పందించింది. చర్చకు పది - ఇరవై రోజులు ఎందుకని ప్రశ్నించటంతో పాటు.. చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. మీరు మాకు పంపిన లేఖలో మా ప్రశ్నలు ఏమిటని అడుగుతున్నారని.. మీరు చేసిన నాలుగు నెలల పరిశోధన మీద నమ్మకం లేదా అని ప్రశ్నించారు.

తమ ప్రశ్నలన్ని సభలో చర్చ సందర్భంగా లేవనెత్తుతామని.. మీరు చేసిన పనిపై మీకు నమ్మకం ఉంటే.. ఎప్పుడు.. ఎవరు ఎలాంటి ప్రశ్న అడిగినా చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఒకవేళ తాము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదని ఒప్పుకోవాలన్నారు. లేఖలతో టైం వేస్టు చేయొద్దని.. విలువలపై నమ్మకం ఉంటే.. చర్చ డేట్ ను ప్రకటించాలని.. తాము వస్తామని ప్రకటించారు. మరి.. టీటీడీ స్పందన ఏమిటో చూడాలి.