Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో ‘ఈటల’కే జై.. టీఆర్ఎస్ కు భారీ షాక్

By:  Tupaki Desk   |   2 Nov 2021 2:48 PM GMT
హుజూరాబాద్ లో ‘ఈటల’కే జై..  టీఆర్ఎస్ కు భారీ షాక్
X
తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా నరాలు బిగబట్టి ఎదురుచూసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. సీఎం కేసీఆర్ ను ఎదురించి బయటకొచ్చిన ఈటల రాజేందర్ కే ప్రజలు పట్టం కట్టారు. కేసీఆర్ సర్కార్ నుంచి తొలగించబడ్డ ఈటలపై సానుభూతి చూపారు. ఈ యుద్ధంలో ఈటల వైపే హుజూరాబాదీలు నిలబడి టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు.

నువ్వా నేనా అన్నట్టుగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితంలో ఈటల రాజేందర్ కే ప్రజలు పట్టం కట్టారు. రౌండ్ రౌండ్ కు గట్టి పోటీలా సాగి.. అంతిమంగా ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీ దక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచారు. ఏకంగా 23865 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పై బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.

ముందుగా పోస్టల్ బ్యాలెట్టలో టీఆర్ఎస్ కు లీడ్ వచ్చింది. అనంతరం కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకూ ఈటల రాజేందర్ ఆధిక్యత కనబరిచారు. ఒక్క 8వ, 11వ రౌండ్లలో మాత్రమే వెనుకబడ్డారు. మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం సాధించి చివరకు 24వేల ఓట్ల ఆధిక్యంతో బంపర్ విక్టరీ సాధించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామంలో టీఆర్ఎస్ వెనుకబడడం షాకింగ్ గా మారింది. ఆ గ్రామంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించారు.కాంగ్రెస్ అభ్యర్థి సరిగా లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లు కూడా ఈసారి ఈటలకే పడ్డాయి. అందుకే కాంగ్రెస్ అభ్యర్థికి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.

బలమైన కేసీఆర్ ను ఎదురించి ఈటల ఒంటరిగా ఏటికి ఎదురీదుతున్నాడన్న సానుభూతి ప్రజల్లో వ్యక్తమైంది. ఎన్నికల్లో సానుభూతి పవనాలు గెలుపోటములను తారుమారు చేశాయి. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకత ఉన్నా ఈటల తన సొంత ఇమేజ్ తోనే ప్రజలను మెప్పించి గెలవడం విశేషం. బీసీ కార్డు, అందుబాటులో ఉండే నేతగా ఇంటింటికి తిరిగి ప్రజాభిమానాన్ని చూరగొని బలమైన అధికార టీఆర్ఎస్ ను ఓడించి సంచలనం సృష్టించాడు.