Begin typing your search above and press return to search.

కేసీఆర్ డబుల్ కలకు కొత్త కష్టం తెచ్చిన పాడువాన

By:  Tupaki Desk   |   15 Oct 2020 12:00 PM IST
కేసీఆర్ డబుల్ కలకు కొత్త కష్టం తెచ్చిన పాడువాన
X
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుగులేదన్న విషయం తెలిసిందే. ఆయన ధాటికి పెద్ద పెద్ద నేతలు సైతం తేలిపోయిన పరిస్థితి. జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపి.. అంబానీ లాంటి వాడ్ని ఎదుర్కొన్న వారు సైతం.. కేసీఆర్ రాజకీయ చాణుక్యం ముందు తేలిపోయారనే చెప్పాలి. అలాంటి కేసీఆర్ మాష్టారికి తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో ఇబ్బంది పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూం కల.. ఎంత బలమైనదో తెలిసిందే. పేదలకు మాత్రం చక్కటి గూడు ఉండనక్కర్లేదా? అంటూ ఆయన స్టార్ట్ చేసిన.. ఇళ్ల పథకం ఒక అస్త్రంగా మారటమే కాదు.. ఈ పథకాన్ని చూసి మధ్యతరగి ప్రజలు సైతం అసూయ చెందే పరిస్థితి ఉందంటారు. అలాంటి ఈ పథకాన్ని తాజాగా కురిసిన వర్షాలు కొత్త సమస్యను తీసుకురావటం ఖాయమంటున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. తాజాగా కురిసిన వర్షాలతో నిర్మాణం దాదాపు పూర్తి చేసుకున్న కొన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు మునిగిపోయిన వైనం బయటకు వచ్చింది. అక్రమ నిర్మాణాలు.. నాలాల్ని ఆక్రమించటం.. ఇష్టారాజ్యంగా నిర్మాణాల కారణంగా.. భారీవర్షాలకు మునగటం.. తీవ్ర ఇబ్బందులు చోటు చేసుకోవటం తెలిసిందే. అయితే.. పక్కాగా అన్ని చూసుకొని ప్రభుత్వమే నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇంత భారీగా మునిగిపోవటమా? అన్నది షాకింగ్ గా మారింది. అంతేకాదు.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టిందని చెప్పాలి.

వర్షం కురిస్తే.. ఇళ్లు మునిగే చోట డబుల్ బెడ్రూం ఇళ్లు కడతారా? అని విపక్షాలు ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంతకీ ఈ డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడకట్టారు? ఎందుకని.. అంతలా వరద నీటిలో చిక్కుకున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అప్పపల్లిలో భారీ ఎత్తున డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. త్వరలో వీటిని ప్రజల చేతికి ఇవ్వాలనుకుంటున్న వేళ.. తాజాగా కురిసిన భారీ వర్షాలతో.. ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల అసలు రంగు బయట పడింది.

వాగు పక్కనే భూమిలో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టేందుకు అనుమతించటంతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. సారు.. మీరు కట్టించినడబుల్ బెడ్రూం ఇళ్లు వర్షం దెబ్బకు ఇలా మునిగిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడకు మునిగిన ఈ డబుల్ బెడ్రూం ఇళ్ల ఫోటో తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది.