Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. ఆ దేశంలో బంగారు షాపులు కిటకిట.. కారణం తెలుసా?

By:  Tupaki Desk   |   4 Dec 2020 1:00 PM IST
కరోనా వేళ.. ఆ దేశంలో బంగారు షాపులు కిటకిట.. కారణం తెలుసా?
X
ప్రపంచంలోని ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాలను దెబ్బేసింది కరోనా మహమ్మారి. దీని పుణ్యమా అని.. లాక్ డౌన్ అంటే తెలీని ఈ తరం వారికి బాగా అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతకాలన్న విషయంపైనా అవగాహన వచ్చేసింది. లాక్ డౌన్ అనంతరం.. అన్ లాక్ లో భాగంగా షాపులు తెరవటం.. రవాణా సౌకర్యం మెరుగుపడటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.

మనదేశంతో పాటు.. పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇందుకు ధనిక దేశమైన కువైట్ లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే.. ఆ దేశంలోని మిగిలిన షాపులతో పోలిస్తే.. బంగారు దుకాణాలు కిటకిటలాడిపోవటం ఆసక్తికరంగా చెప్పాలి. ఈ రద్దీ వెనుక కరోనా భయం వెంటాడుతుందంటున్నారు. బంగారానికి.. కరోనాకు లింకేమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి కువైట్. ఆ దేశంలో నగల దుకాణాలు మహా రద్దీగా ఉండటానికి కారణం.. రానున్న రోజుల్లో ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం పట్టేస్తుందన్న ముందు జాగ్రత్తతోనే బంగారాన్ని భారీగా కొనుగోలు చేసి పెట్టుకోవటం గమనార్హం. కువైట్ ఆదాయంలో సింహభాగం ముడిచమరు అమ్మకాలతో పాటు.. టూరిజం మీదనే. కరోనా కారణంగా బ్యారెల్ ముడిచమురు ధర 40 డాలర్లకు అటు ఇటుగా ఉంది. మహమ్మారి పుణ్యమా అని ముడి చమురు వినియోగం భారీగా తగ్గింది. దీంతో.. డిమాండ్ పెద్దగా లేదు. అయితే.. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆ దేశం రుణ సమస్యను ఎదుర్కొంటోంది. దీనికి కారణం.. ఆ దేశ ప్రభుత్వం అనుసరించిన విధానాలేనని చెప్పక తప్పదు.

సంపన్న దేశాల్లో ఎలా అయితే.. తమ ప్రజలకు వివిధ సదుపాయాలు.. సంక్షేమ పథకాలు.. భారీ ప్రయోజనాలు అందిస్తారో.. కువైట్ లోనూ అలాంటి పరిస్థితే ఉంది. చౌక విద్యుత్.. ఇంధనం ధరలు బాగా తక్కువగా ఉంటాయి. ఉచిత ఆరోగ్య సంరక్షణతో పాటు.. విద్యను అందిస్తారు. కరోనా నేపథ్యంలో ముంచుకొచ్చే ఆర్థిక సమస్యను అంచనా వేసిన పలు సంపన్న దేశాలు..పన్నులు పెంచటం.. సంక్షేమ పథకాలు.. సదుపాయాలకు కోత పెట్టాయి. కువైట్ మాత్రం పాత విధానాన్ని కొనసాగించింది. అదే ఇప్పుడా దేశాన్ని సమస్యల్లోకి తీసుకెళుతోంది.

కరోనా నేపథ్యంలో తొలిసారి మూడీస్ కువైట్ సార్వభౌమత్వ రుణ రేటింగ్ ను తగ్గించింది. అంతే కాదు.. ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి లో లోటు 40 శాతానికి చేరుతుందని చెబుతున్నారు. 1990లలో ఇరాక్ తో యుద్ధం.. గల్ఫ్ యుద్దం సందర్భంగా ఏర్పడి ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంత పెద్ద సంక్షోభం మళ్లీ ఇప్పుడేనని చెబుతున్నారు. అయితే.. కువైట్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ వద్ద 533 బిలియన్ డాలర్ల ఆస్తులుఉన్నప్పటికీ.. వాటిని ఖర్చు చేసే అధికారం మాత్రం ప్రభుత్వానికి ఉండదు. కేవలం 33 బిలియన్ డాలర్లకు మించి ఖర్చు చేసే వీలు లేదు.

ఒకవేళ.. మరింత మొత్తాన్ని ఖర్చుచేయాలంటే దేశ పార్లమెంటు ఒప్పుకోవాలి. అయితే..అరబ్ దేశాల్లో అలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి. అయితే.. అప్పు చేసి సంక్షోభం నుంచి బయటపడొచ్చని భావిస్తున్నా.. అలా జరిగే అవకాశం తక్కువంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వెళ్లింది. దీంతో.. ఆర్థిక సంక్షోభం ఏర్పడితే.. కరెన్సీ విలువ పడిపోయే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో.. పలువురు తమ సంపదను బంగారంగా మార్చేసుకుంటున్నారు. దీంతో.. బంగారు దుకాణాలు కిటకిటలాడిపోతున్నాయి.