Begin typing your search above and press return to search.

ఏపీ లో స్పందన కు కనివిని ఎరుగని స్పందన !

By:  Tupaki Desk   |   25 Nov 2019 10:01 AM GMT
ఏపీ లో స్పందన కు కనివిని ఎరుగని స్పందన !
X
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బాధ్యతలని చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధిని ఉరకలు పెట్టిస్తున్నారు. ప్రభుత్వం పై ప్రజలు సదాభిప్రాయం తో ఉంటే , ప్రతి పక్షాలు మాత్రం ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. కానీ , రాజకీయాల లో అదొక అస్త్రం. ప్రభుత్వం అన్నాక అభివృద్ధి పనులు చేయాలి ..ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. సీఎంగా జగన్ భాద్యతలు తీసుకున్న తరువాత ప్రజలకి మంచి జరిగేలా అనేక పథకాలని సీఎం ప్రవేశ పెట్టారు. జగన్ అమలుచేస్తున్న అనేక కార్యక్రమాల లో సీఎం జగన్ కి అత్యంత ఇష్టమైనది.. సీఎం మానస పుత్రికగా గుర్తింపు దక్కించుకున్నది స్పందన కార్యక్రమం.

వారానికి ఒకరోజు రాష్ట్రం లో ప్రతి చోట స్పందన కార్యక్రమం నిర్వహించేలా పక్కా ప్రణాళికని రూపొందించారు. అలాగే స్పందన అంటే కేవలం , ప్రజలు ఇచ్చే ఫిర్యాదులని తీసుకోవడమే కాకుండా ..ఒక కచ్చితమైన సమయంలోనే ఆ సమస్య కి ఒక పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ స్పందన కార్యక్రమంతో ప్రజల్లో మార్పు మొదలైంది. మహిళలు సైతం ధైర్యంగా పోలీస్ స్టేషన్‌‌ కి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అలాగే స్పందన ద్వారా వచ్చే కేసులని పోలీసులు కూడా ఛాలెంజింగ్ తీసుకుని ప్రజల సమస్యలను తీర్చుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 18 వారాల్లో స్పందన ద్వారా 42వేల 220 ఫిర్యాదు వచ్చాయని, అందులో 9వేల 441 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, మరో 3వేల 71 కేసుల్లో ఇంతకుముందే ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాగే ఇప్పటివరకు వచ్చిన 42వేల 220 ఫిర్యాదుల్లో 40వేల 158 అంటే 95శాతం కంప్లైంట్స్ పరిష్కారమైనట్లు తెలిపారు. కేవలం 2వేల 62 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. గతంలో అధికారులను కలవాలంటే కష్టమయ్యేదని, కానీ ఇప్పుడు వాళ్లే తమ సమస్యలు వింటూ ఆర్జీలు స్వీకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక్కరోజు కాకుండా, కనీసం రెండ్రోజులు, లేదా అంటే ఎక్కువ రోజులు పెడితే ప్రజల కు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు.

ఈ స్పందన కార్యక్రమానికి ఒకవైపు విశేష స్పందన రావడం మరోవైపు స్పందన గురించి సాక్షాత్తు దేశ ప్రధానే స్వయంగా ఆరా తీయడంతో ఏపీ పోలీసులు గర్వంగా ఫీలవుతున్నారు. గుజరాత్ వడోదరలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌లో ఏపీ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమయంలో ప్రధాని మోడీ స్పందన గురించి ప్రధాని కార్యాలయానికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు సూచించారు. తాము పడుతున్న కష్టానికి, ఏకంగా ప్రధాని నుంచే ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని స్పందన కోఆర్డినేటర్ అండ్ డీఐజీ పాలరాజు అంటున్నారు.