Begin typing your search above and press return to search.

ఆఫీస్ అయ్యాక బాస్ మెసేజ్ చేస్తే భారీ ఫైన్..!

By:  Tupaki Desk   |   15 Nov 2021 7:34 AM GMT
ఆఫీస్ అయ్యాక బాస్ మెసేజ్ చేస్తే భారీ ఫైన్..!
X
కరోనా కారణంగా చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాయి. దీంతో చాలామంది ఇంటి దగ్గర నుంచే.. తాము చేయాల్సిన పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు పనిచేయాల్సిన గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి వాటికి చెక్ పెట్టే దిశగా ఓ దేశం కీలక నిర్ణయం తీసుకుంది పని గంటలు పూర్తయిన తరువాత సంస్థ నుంచి ఎటువంటి అధికారిక మెయిల్ కానీ మెసేజ్ రాకుండా ఉండేందుకు ఓ చట్టాన్ని తీసుకొస్తుంది.

ఈ చట్టానికి ఉద్యోగి విశ్రాంతి తీసుకునే హక్కుగా పేరు పెట్టింది ఆ దేశ పార్లమెంట్. అ దేశమే పోర్చుగీస్. నానాటికీ విస్తరిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ను మరింత ముందుకు తీసుకుపోయే ఈ విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత జీవితానికి... చేసే వృత్తికి మధ్య సమతుల్యత లోపం రాకుండా ఉండేందుకని పేర్కొంది.

ఈ చట్టం ప్రకారం పని గంటలు ముగిసిన తర్వాత బాస్ ఫలానా పని చేయండి అని మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపించేందుకు వీలు ఉండదు. ఇలా చేస్తే ఆ సంస్థలకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుందని పోర్చు గీస్ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా 11 లేదా అంతకంటే ఎక్కువ మంది ఎందరు కార్మికులు ఉన్నా ఇదే నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగులకూ పిల్లలు ఉంటే అధికారులకు సమాచారం ఇచ్చి వర్క్ ఫ్రం హోం నిరభ్యంతరంగా చేయవచ్చు.

పిల్లలు లేని వాళ్ళు అయితే ఆఫీసుకు వచ్చే దానిపై సంస్థ నే అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. కొత్త చట్టం ప్రకారం వర్క్ ఫ్రం హోం చేయడంతో వచ్చే అధిక కరెంట్ బిల్, ఇంటర్నెట్ చార్జీలను సదరు కంపెనీ నే భరించాల్సి వస్తుందని చెప్తుంది. అంతేకాకుండా ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు లోన్లీ ఫీలింగ్ కాకుండా అప్పుడప్పుడూ ముఖాముఖీ సమావేశాలు కూడా నిర్వహించాలని ఈ చట్టం సూచిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ చట్టంలోని కొన్ని కీలక విషయాలకు పోర్చుగల్ పార్లమెంటు ఆమోదం తెలుపలేదు. చాలామంది పనిగంటలు ముగిసిన తర్వాత వారి ఫోను స్విచ్ ఆఫ్ చేయడం అనేది తప్పుగా భావించింది. అందుకే రైట్ టు డిస్కనెక్ట్ అనే దానిని చట్టం నుంచి తొలగించారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. డిజిటల్ వైపు ఉద్యోగులను అడుగులు వేయించేందుకు ఇది ఒక కీలక నిర్ణయం అక్కడ అధికారులు చెబుతున్నారు.

అంతేకాకుండా పెద్ద ఎత్తున ఫ్రీలాన్సింగ్ చేసే ఉద్యోగులను ఆకర్షించేందుకు ఈ చట్టం ఎంతగానో సహకరిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యం ఉంది. ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలు మన దేశంలో కూడా వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు.