Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఈసారి పోలింగ్ లో భారీ కోత ఖాయమా?

By:  Tupaki Desk   |   8 April 2019 6:33 AM GMT
తెలంగాణలో ఈసారి పోలింగ్ లో భారీ కోత ఖాయమా?
X
విలన్ లేని సినిమాను చూడగలమా? విలన్ ఎంత బలవంతుడైతే.. హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి సినిమాల్నే చూడండి. సినిమా ఏదైనా అందులో ఆయన విలన్ ఎంత బలవంతుడో చెప్పేస్తుంటారు. హీరో ఈగ.. దాని విలన్ మనిషి అయినప్పటికీ.. బెదరని ఈగ.. మనిషిని ఎంతలా ఇబ్బంది పెట్టిందన్న విషయాన్ని సినిమాగా చెబితే.. ప్రేక్షకులు ఎన్ని కోట్లు కుమ్మరించారో తెలుసుకదా?

ఎందుకిలా? అంటే.. ఆ సినిమాలో విలన్ బలవంతుడైనా.. అర్బక ఈగ చూపించిన హీరోయిజంకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ పోటాపోటీకి ఉండే ఉత్సాహానికి.. ఏకపక్షంగా నడిచే వాటి పట్ల ఉండే ఆసక్తికి సంబంధం ఉండదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాన్నే చూస్తే.. ఏపీలో రాజకీయం రసవత్తరంగా ఉంటే.. తెలంగాణలో తేలిపోయినట్లు కనిపిస్తుంది. ఏపీలో రాజకీయం రెండు మదపటేనుగులు తలపడినట్లుగా ఉంటే.. తెలంగాణలో వార్ వన్ సైడే అన్నట్లు ఉందన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఒక్క లోక్ సభ ఎన్నికలే జరుగుతున్నాయి. ఏపీలో అధికార.. ప్రతిపక్షం నడుమ నడుస్తున్న ఎన్నికల యుద్ధం ఒక రేంజ్లో ఉంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో విపక్ష అధిపత్యం సాగుతుంటే.. తెలంగాణలో అధికారపక్ష హవాకు ఎదురు నిలిచేటోళ్లు లేరని చెబుతున్నారు.

దీంతో.. ఏపీలో రాజకీయం రసవత్తరంగా.. తెలంగాణలో రాజకీయం తేలిపోతున్న పరిస్థితి. దీనికి తోడు ఏపీలో నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ.. ఏపీలో ఓటు ఉన్నోళ్లు ఏపీలోనే ఓటు వేయటానికి వెళుతున్న పరిస్థితి. ఉన్న ఊళ్లో ఎంచక్కా ఓటు వేయొచ్చుగా అంటే.. నో అంటున్న వారు.. సొంత డబ్బుతో.. సెలవులు పెట్టుకొని మరీ ఊరెళ్లి ఓటు వేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ కారణంతో హైదరాబాద్ మహానగర పరిధిలోని నాలుగు లోక్ సభ నియోజకవర్గాలు (హైదరాబాద్.. సికింద్రాబాద్.. మల్కాజిగిరి.. చేవెళ్ల) స్థానాల్లో పోలింగ్ దారుణంగా పడిపోతుందని చెబుతున్నారు.

ఇక.. తెలంగాణలోని ఇతర స్థానాల్లోనూ ఈసారి పోలింగ్ పెద్దగా ఉండదంటున్నారు. అధిక్యత వన్ సైడ్ గా ఉండటం.. మండే ఎండల కారణంగా ఓటేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. ఈ అంచనా కానీ నిజమైతే.. తెలంగాణలో అత్యల్ప ఓటింగ్ నమోదు కావటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. నష్టం ఎవరికంటారు?