Begin typing your search above and press return to search.

భారీ డిస్కౌంట్: భారత్ కు రష్యా చమురు

By:  Tupaki Desk   |   1 April 2022 10:30 AM GMT
భారీ డిస్కౌంట్: భారత్ కు రష్యా చమురు
X
ఉక్రెయిన్ పై దండయాత్ర నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే భారత్ కు చౌక ధరకు ముడి చమురును విక్రయించేందుకు రష్యా ముందుకొచ్చింది. తాజాగా మరింత డిస్కౌంట్ ను ప్రకటించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటికే రష్యా నుంచి 30 లక్షల బ్యారెళ్ల ముడిచమురును డిస్కౌంట్ లో కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ ను మరింతగా ఆకర్షించి ఎగుమతులు పెంచుకోవాలని రష్యా భావిస్తోంది. ఇందుకోసం బ్యారెల్ ధరపై 35 డాలర్ల వరకూ డిస్కౌంట్ ను ప్రకటించింది. అంటే యుద్ధానికి ముందున్న ధరకే ముడిచమురును విక్రయిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చిందని సమాచారం.

ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతోపాటు రూబుల్-రూపాయి చెల్లింపు విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించినట్టు సమాచారం.

ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్ లవ్రోడ్.. కేంద్రంతో జరిపే చర్చల్లో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

కాగా యుద్ధ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. ఈ డిస్కౌంట్ ఆఫర్ కు భారత్ అంగీకరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీనిపై మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇక రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది.

రష్యా నుంచి భారత్ డిస్కౌంట్ లో చమురు కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే భారత్ దీనిపై చూపిస్తున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలని సూచించింది.