Begin typing your search above and press return to search.

శ్రీవారి దర్శనానికి ఇన్ని కష్టాలా..?

By:  Tupaki Desk   |   4 Oct 2015 4:27 AM GMT
శ్రీవారి దర్శనానికి ఇన్ని కష్టాలా..?
X
వరుస సెలవులు వస్తే చాలు.. తిరుమలగిరి కిక్కిరిపోతున్న వైనం తెలిసిందే. ఇదేం కొత్తేం కాదు. గత మూడేళ్లుగా ఇలాంటి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే సెలవుల సమయంలోనూ.. అక్కడ విశేష దినాల సందర్భంలోనూ తమిళ భక్తులు భారీగా తిరుమల కొండకు చేరుకొని.. శ్రీవారి దర్శనం కోసం తహతహలాడటం తెలిసిందే.

గాంధీ జయంతితో వరుసగా మూడు రోజులు (చాలామందికి) సెలవులు రావటం.. దీనికి తోడు తమిళనాడు సర్కారు దసరా సెలవుల్ని ముందుగా ఇచ్చేయటంతో తిరుమల గిరికి భక్తులు పోటెత్తుతున్నారు. దీనికి తోడు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు మరింత భారీగా ఉండటంతో ఒక్క.. శనివారం నాడే 2.50లక్షల మంది తిరుమల కొండ మీదకు చేరుకున్న పరిస్థితి.

దీనికి తోడు.. భారీగా కురిసిన వానలతో తిరుమల కొండ తడిచి ముద్దదైంది. కొండ మీదకు నడిచి వస్తున్న భక్తులు మొదలు.. స్వామి వారి దర్శనానికి క్యూలో నిలుచున్న భక్తులు వరకూ అందరూ వర్షం కారణంగా తడిచి ముద్దయ్యారు. భక్తులు భారీగా కొండకు తరలిరావటంతో క్యూ కాంప్లెక్స్ లన్నీ నిండిపోయి.. భక్తుల క్యూ లైను రెండు కిలోమీటర్ల మేర ఉండటంతో భక్తులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు.

భారీగా భక్తులు కొండకు పోటెత్తే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు.. వర్షం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏం చేయాలన్న అంశంపై టీటీడీ అధికారులు సరైన కసరత్తు చేయకపోవటంతో లక్షలాది భక్తులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. రూములు దొరకక.. పెళ్లాం బిడ్డలతో ఆరుబయట ఉండే వారు.. వర్షం కారణంగా తడవకుండా ఉండేలా సౌకర్యం కల్పించటంతో టీటీడీ అధికారుల వైఫల్యంపై భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. శనివారం ఒక్కరోజులో స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85 వేలకు చేరింది. ఇంత భారీగా భక్తులు కొండకు తరలి వస్తున్న నేపథ్యంలో.. టీటీడీ అధికారులు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా.. ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్న విషయాన్ని మర్చిపోకూడదు.