Begin typing your search above and press return to search.

పారాసెటమాల్ కు భారీ గిరాకీ.. పిప్పరమెంట్లు మాదిరి మింగుతున్నారు..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 6:20 AM GMT
పారాసెటమాల్ కు భారీ గిరాకీ.. పిప్పరమెంట్లు మాదిరి మింగుతున్నారు..!
X
కరోనా పుణ్యమా అని.. అందరికీ ఆరోగ్యం, ఆహారం పై శ్రద్ధ పెరిగింది. ఇక కనీస నాలెడ్జి లేనివారికి కూడా మందులపై కాస్తో కూస్తో అవగాహన పెరిగింది.

ఒంట్లో ఏమాత్రం తేడా గా అనిపించినా సరే ఓ టాబ్లెట్ మింగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ టాబ్లెట్ వేసుకుంటే చాలు.. ఒంట్లో పడి ఉంటుందని వేసుకునేవాళ్లూ లేకపోలేదు. అందుకే జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్ ట్యాబ్లెట్లకు భారీ గిరాకీ పెరిగింది. మందుల లాగా కాదు పిప్పరమెంట్లు మాదిరిగా మింగేస్తున్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి ఔషధాలు ఇంకా కనుగొనలేదు. అయితే వైరస్ బాధితులకు చికిత్సకు సాధారణ జ్వరానికి వినియోగించే పారాసెటమాల్ మాత్రలు ఉపయోగిస్తున్నారు.

అందుకే కరోనా కాలంలో ఈ ట్యాబ్లెట్ల అమ్మకం అమాంతంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలో మన దేశంలో ఏకంగా 350 కోట్ల ట్యాబ్లెట్ల విక్రయం జరిగింది. ఈ మేరకు ఫార్మా కంపెనీలు, ఔషధ రిటైల్ దుకాణాలు ప్రకటించాయి.

జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్ మందు వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్ లోకి వచ్చింది. అయితే అవన్నీ కూడా గతంలో లేనివిధంగా అమ్మకాలు జరిగాయి. వీటిలో డోలో టాబ్లెట్ ది పై చేయి.

కరోనా పరీక్షల తర్వాత పాజిటివ్ అని తేలితే ప్రభుత్వం అందించే కిట్లలోనూ డోలో కి స్థానం ఉంది. ఫలితంగా దీని అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. అంతేకాకుండా మెడికల్ షాప్ కి వెళ్లి... పలకడానికి ఈజీగా ఉండడం వల్ల డోలో ఎక్కువ శాతం అమ్ముడైంది. వీటితో పాటు కరోనా సోకితే విపరీతమైన జ్వరం వస్తుంది.

ఇతర బ్రాండ్లలో పారాసెటమాల్ 500 ఎంజి కలిగి ఉంటే.. డోలో ఏకంగా 650 ఎంజీ కలిగి ఉంది. ఈ నేపథ్యంలో జ్వర తీవ్రత నుంచి త్వరగా విముక్తి పొందేందుకు ఈ మాత్రను ఉపయోగిస్తున్నారు. డోలో అమ్మకాలు ఏడాదిలో 70 శాతం పెరిగాయి.

పారాసెటమాల్ ఫార్ములా కలిగిన డోలో తో పాటు క్రోసిన్, కాల్పాల్ వంటి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. డోలో తో పాటు ఇతర బ్రాండ్ల మాత్రలు కూడా భారీగానే సేల్ అయ్యాయి.

జనాలు కరోనా భయంతో ఒంట్లో ఏమాత్రం తేడాగా ఉన్నా కూడా వరుసపెట్టి మాత్రలు మింగుతున్నారు. అయితే ఔషధ దుర్వినియోగం అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సొంత వైద్యం ఆరోగ్యానికి హానీ చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్లలేక ఇంట్లోనే.. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని జనాలు అంటున్నారు. ఏది ఏమైనా కరోనా నుంచి విముక్తి పొందేందుకు మందులు పిప్పరమెంట్లు మాదిరి మింగుతున్నారు..!