Begin typing your search above and press return to search.

జనమా.. జగన్ ప్రభంజనమా.?

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:47 AM GMT
జనమా.. జగన్ ప్రభంజనమా.?
X
‘కొంగరకలాన్ తేలిపోయింది. మందు పోయించి తీసుకొచ్చినా జనం రాలేదు.. గులాబీ వాడిపోయింది. ఇక ఏపీలో చంద్రబాబు మాట్లాడితే వేదికపైనున్న మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలే బజ్జుంటున్నారు. కానీ జగన్ సభలకు జనం ఎందుకు పోటెత్తుతున్నారు’ హైదరాబాద్ లోని ఓ జర్నలిస్టు మిత్రుడు అంతర్మథనంతో సంధించిన ప్రశ్న..?

‘‘జనం కోసం ఒకటి కాదు రెండు ఏకంగా మూడు వేల కిలోమీటర్లు నడిచొస్తున్నాడాయన. కుటుంబాన్ని వదిలి 264 రోజులుగా జనంలోనే ఉన్నాడు. జనం సమస్యలపైనే తపిస్తున్నాడు. తన ప్రేమనంతా ప్రజలకే పంచుతున్నాడు. అందుకే ఆ ప్రజలిప్పుడు ఆ ప్రేమను జగన్ కు తిరిగిస్తున్నారు.. ప్రేమతో తరలొస్తున్నారు.. ’’ ఓ ఆంధ్రా జర్నలిస్టు సమాధానమిది..

నిజమే ఇదీ.. గోడకు మనం ఎంత బలంగా బంతిని కొడితే అంతే బలంగా తిరిగొస్తుంది. ఇప్పుడు అన్ని బంధాలకు దూరంగా జనం కోసం పాదయాత్ర చేపట్టిన జగన్ అన్నీ జనంతోనే పంచుకుంటున్నాడు. అందుకే తమకోసం వచ్చిన జననేతకు జనం నీరాజనం పలుకుతున్నారు. జగన్ కోసం తరలివస్తున్నారు. జనసంద్రాన్ని తలపిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా కనిపిస్తున్నారు. ఎక్కడిదీ అభిమానం.. ఎంందుకీ వాత్సల్యం.. జగన్ పై ఎందుకీ మమకారం.. జనం గుండెచప్పుడు తెలుసుకునేందుకు కదిలివచ్చిన జననేతకు ఎందుకీ అపూర్వస్వాగతం..? అని ప్రశ్నించేవాళ్లకు దిమ్మదిరిగేలా జనహారతి పడుతున్నారు.

‘రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. పొత్తుల ఎత్తుల్లో చిత్తైపోయింది. మాయ చేసి అధికారంలోకి వచ్చిన వారు కొట్టుకుంటూ జనం చేతిలో పూలు పెడుతున్నారు. బాగు చేస్తారని అధికారమిస్తే దోచుకుంటున్నారు..అందుకే ఆ మాకోసం తరలివచ్చిన జగన్నకు మద్దతుగా వచ్చా’ అంటూ ఓ ఉద్యోగి ఎమోషనల్ అయ్యాడు..

‘ఆ రాజన్న మాకెంతో చేశాడు. ఆయన కొడుకు మాకోసం ఎన్నో కిలోమీటర్లు నడిచివస్తున్నాడు.. జనం కోసం ఆయన పడుతున్న తపనను చూద్దామనే వచ్చా’ అని యాదమ్మ అనే వృద్ధురాలు అప్యాయంగా చెప్పుకొచ్చింది.

ముసలి ముతక - యువత - ఉద్యోగులు - కూలీలు - ప్రజలు.. ఇలా జననేత కోసం తరలివచ్చారు. తమకోసం అన్ని వేల కిలోమీటర్లు నడిచొచ్చిన అధినేతను కళ్లారా చూసి చలించిపోయారు. విశాఖ పట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం వద్ద వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభకు ఆశేష జనవాహిని తరలివచ్చింది. మునుపెన్నడూ లేనంతగా కిక్కిరిసిన ఆ వీధులు జగన్ కే కాదు అక్కడున్న నేతలకూ సంభ్రమాశ్చార్యాలకు గురిచేశాయి.

భీమలి చుట్టుపక్కల ఓ యువకుడు జగన్ చిత్రపటాన్ని గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. జగన్ వస్తున్నాడని తెలిసి ఆయన్ను చేరుకున్నాడు. జగన్ ఆప్యాయంగా పలకరించాడు. అతడి చేయి పట్టుకొని నడిచాడు. తన అభిమాన నేత తనతో కలిసి నడవడం చూసి ఆ యువకుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. జగన్ కు జైజైలు పలుకుతూ ముందుకుసాగాడు.

ఎందరో జగన్ ను గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి మాత్రమే ఊపు అన్న విమర్శకులకు నోళ్లు మూయించే జనం జగన్ సభలకు తరలివస్తున్నారు. ఎలాంటి పిలుపు లేకుండా వైసీపీ నాయకులు తరలించకుండానే జగన్ కోసం అప్యాయంగా ఉరికి వస్తున్నారు. ఈ ఊపు, ఈ ఉత్సాహం చూస్తుంటే వచ్చేసారి జగన్ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇటీవలే జాతీయ అగ్ర మీడియా సంస్థలు నిర్వహిచిన సర్వేలు కూడా జగన్ దే అధికారం అని తేల్చిచెప్పాయి. జగన్ పాదయాత్రకు జననీరాజం చూశాక ఆ వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తోందని స్పష్టమవుతుంది. ఈ గాలి హోరుకు అధికార, అనుబంధ పక్షాలన్నీ కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.