Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘సోషల్’ ఫ్రీడమ్.. మెడకు చుట్టుకుంది..

By:  Tupaki Desk   |   29 March 2019 2:52 PM IST
కేసీఆర్ ‘సోషల్’ ఫ్రీడమ్.. మెడకు చుట్టుకుంది..
X
కేసీఆర్ పుణ్యానికి పోతే తలనొప్పిగా మారిన వ్యవహారంగా తాజాగా చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా నందుల పల్లికి చెందిన యువరైతు శరత్ తన ఏడెకరాలను వీఆర్వో వేరే వాళ్లకు పట్టా చేశాడని ఆరోపించడం.. దాన్ని ఫేస్ బుక్ లో పెట్టడం.. సీఎం కేసీఆర్ చూసి స్వయంగా ఫోన్ చేసి పరిష్కరించడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. రైతు బంధు సాయాన్ని కూడా అదే రోజు అందించి రైతుపక్షపాతిగా కేసీఆర్ నిలిచారు.

ఇక శరత్ కు ఏడు ఎకరాలను సీఎం కేసీఆర్ దగ్గరుండి పట్టా చేయించడంపై శరత్ సోదరి జ్యోతి మీడియాకెక్కింది. ఆ భూమిలో శరత్ కు ఒక్కరికే హక్కు లేదని.. తమకు కూడా హక్కులు ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వాపోయింది. తాజాగా ఆమె మంచిర్యాల కలెక్టర్ ను కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది.

శరత్ కు కేసీఆర్ ఏడు ఎకరాలు కట్టబెట్టడంపై ఆయన సోదరి జ్యోతి ఫేస్ బుక్ లో మరో పోస్టు పెట్టింది. శరత్ తండ్రి, తమ తండ్రి అన్నాదమ్ములని.. ఇందులో ఇద్దరికీ వాటా ఉందని ఆమె ఆరోపిస్తోంది. భూమిపై శరత్ తోపాటు తమ కుటుంబానికి వాటా ఉందని.. హైదరాబాద్ లో పనిచేసుకుంటున్న మాత్రానా తమను విస్మరించడం దారుణమని.. తాము పేదవాళ్లమే అని జ్యోతి పేర్కొంది. జ్యోతి పోస్టింగ్ పై సీఎం కార్యాలయం స్పందించింది. వెంటనే మంచిర్యాల కలెక్టర్ ను పంపి వివరాలు సేకరించింది. విచారణ జరుపుతున్నారు.

ఫేస్ బుక్ పోస్టుపై కేసీఆర్ స్పందించి పరిష్కరించడంతో మరికొందరు రైతులు కూడా ఇప్పుడు ఇదే బాటపడుతున్నారు. తమ భూమి సమస్యలను పరిష్కరించాలంటూ కొందరు రైతులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో శరత్ ఉందంతంతో మలుపులు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా భూసమస్యపైన సోషల్ మీడియా ద్వారా సీఎం కార్యాలయానికి దుబ్బాక మండలం పెద్దచిక్కోడ్ రైతులు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

భూ ప్రక్షాళన, భూరికార్డుల సరిదిద్దడంలో రెవెన్యూ సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యం.. అక్రమాల వల్ల గ్రామాల్లో సమస్యలు పెరిగిపోయాయి. ప్రస్తుతం శరత్ ఉందంతంలో కేసీఆర్ ఎంట్రీతో సీఎం కార్యాలయానికి కుప్పలు తెప్పులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. గుట్టలకొద్దీ ఫిర్యాదులు రావడంతో సీఎం కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.