Begin typing your search above and press return to search.

టీపీసీసీ రేస్: ఎవరి లాబీయింగ్ వాళ్లు ట్రై చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:31 PM IST
టీపీసీసీ రేస్: ఎవరి లాబీయింగ్ వాళ్లు ట్రై చేస్తున్నారా?
X
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు కాంగ్రెస్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎవరి లాబీయింగ్ వాళ్లు చేస్తున్నారు. ఎవరిని అధిష్టానం నియమిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలతోపాటు యువ నేతలు సైతం పోటీ పడుతున్నారు. ఇప్పటికే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ నాలుగు రోజులుగా తెలంగాణలో ఉండి నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ మేరకు తుది నివేదికను మాణిక్యం ఠాకూర్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందజేశారు.

ఇప్పుడు టీపీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. ఈరోజు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా సోనియాగాంధీని కలిసి లాబీయింగ్ చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి నాకు ఇవ్వాలని.. తనకు అన్ని అర్హతలు ఉన్నాయని సోనియా గాంధీని కోరారు.

రేవంత్ రెడ్డి కూడా బుధవారం ఢిల్లీ వెళ్లారు. డిఫెన్స్ కు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం పెద్దలను కలిసేందుకు రెడీ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేసులో ప్రధానంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అటు కోమటిరెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి హస్తినకు చేరడంతో ప్రకటన రావచ్చన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.

మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవిని సీనియర్లు కూడా ఆశిస్తున్నారు. జానారెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క తదితర నేతలంతా తాము పీసీసీ చీఫ్ పదవికి అర్హులమని ప్రకటించారు. ఈ క్రమంలోనే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.