Begin typing your search above and press return to search.

బండి స్పీడ్ తగ్గిందా? బందరు లడ్డూ లాంటి ఛాన్సు మిస్?

By:  Tupaki Desk   |   1 Jun 2021 7:31 AM GMT
బండి స్పీడ్ తగ్గిందా? బందరు లడ్డూ లాంటి ఛాన్సు మిస్?
X
రాజకీయాల్లో అవకాశాలు అన్ని సందర్భాల్లో రావు. అనుకోకుండా వచ్చే వాటిని వెంటనే అందిపుచ్చుకోవటం చాలా అవసరం. ఏ చిన్న అవకాశం ఉన్నా కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరగటమే కాదు.. తనకు తోచినట్లుగా తిట్టేసే తత్త్వం ఉన్న తెలంగాణ బీజేపీ నేతల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందుంటారు. అలాంటి ఆయన ఇటీవల కాలంలో తన నోటికి పని చెప్పటం కాస్త తగ్గించినట్లుగా చెబుతున్నారు.

సెకండ్ వేవ్ కు కాస్త ముందు చూస్తే.. నిత్యం కేసీఆర్.. కేటీఆర్ పై ఏదో ఒక తీవ్ర వ్యాఖ్య చేసేవారు. తరచూ వార్తల్లో నిలిచే వారు. అలాంటి ఆయన కొద్దిరోజులుగా సంచలన వ్యాఖ్యల్ని చేయకపోవటం గమనార్హం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఒకటి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొద్ది కాలం క్రితం కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ ఎంతలా తిట్టిపోశారో తెలిసిందే. దాని కంటే కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ ఎంతో మేలైనదిగా ఆయన పేర్కొన్నారు.

అలాంటి కేసీఆర్.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తామని చెప్పినప్పుడు.. పెద్ద సారు తీరును.. ఆయన మాటలు మార్చే వైనాన్ని ప్రస్తావిస్తూ ఉతికి ఆరేసే అవకాశం ఉంది. కానీ.. అందుకు భిన్నంగా తరచూ ఫైర్ అయ్యేబండి సంజయ్ కామ్ గా ఉండటం తెలిసిందే. కేసీఆర్ సర్కారు తీరును తప్పుల్ని ఎత్తి చూపే అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేయటం మానేసి.. మౌనంగా ఉండటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.

నిజానికి ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్న సీఎం కేసీఆర్ ప్రకటనను సరైన రీతిలో వాడుకోవాలే కానీ.. ఆయన డబుల్ స్టాండ్ ను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే వీలుంది. కానీ.. ఆ అవకాశాన్ని బండి మిస్ కావటం చూస్తే.. బందరు లడ్డూ లాంటి చాన్సును మిస్ అయినట్లే అన్న భావన కలుగక మానదు.