Begin typing your search above and press return to search.

ఢిల్లీ కోర్టులో పేలుడు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని

By:  Tupaki Desk   |   9 Dec 2021 3:21 PM IST
ఢిల్లీ కోర్టులో పేలుడు.. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని
X
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కోర్టుల్లో పేలుడు సంభవించడం కలకలం రేపింది. ఏకంగా దేశ రాజధానిలో ఈ పేలుడుతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వణికిపోయాయి. అంతా పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియక హడలిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అవి ల్యాప్ ట్యాప్ బ్యాటరీలుగా గుర్తించి పేలినట్లుగా నిర్ధారించారు.

ఈ పేలుడులో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో రోహిణి కోర్టు పరిసరాల్లో ఓ గదిలో ఈ పేలుడు సంభవించిందని వెల్లడించారు. రూమ్ నంబర్ 102లో స్కూల్ బ్యాగ్ లో ఉంచి ల్యాప్ ట్యాప్ పేలింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

ల్యాప్ ట్యాప్ నేలపై పడి ఉన్న వీడియోలు.. పోలీస్ సిబ్బంది చుట్టూ తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ల్యాప్ ట్యాప్ బ్యాటరీలో టెక్నికల్ సమస్యల వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

పేలుడుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేసి అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.