Begin typing your search above and press return to search.

నంద్యాల ఫీవ‌ర్‌..న‌వ్యాంధ్ర మొత్తానికీ పాకిందే!

By:  Tupaki Desk   |   7 Aug 2017 12:09 PM GMT
నంద్యాల ఫీవ‌ర్‌..న‌వ్యాంధ్ర మొత్తానికీ పాకిందే!
X
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్పుడు నిజంగానే ఏపీ వ్యాప్తంగా పాకిపోయింది. ఎక్క‌డ చూసినా... ఈ ఉప ఎన్నిక‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఇద్ద‌రు క‌లిసినా... నంద్యాల బై పోల్స్‌లో ఎవ‌రు గెలుస్తారు? ఇప్ప‌టిదాకా ఎవ‌రిది పైచేయిగా ఉంది? ఎవ‌రు వెనుక‌బ‌డ్డారు? ప్ర‌చారంలో వైసీపీ ముందుందా? టీడీపీ దూసుకుపోతోందా? అస‌లు నంద్యాల ఓట‌ర్ల‌లో ఏ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌? ఏ సామాజిక వ‌ర్గం ఎవ‌రి ప‌క్షాన ఉంది? ఆయా సామాజిక‌వ‌ర్గాల్లో చీలిక వ‌స్తే... ఎవ‌రికెక్కువ ఓట్లు ప‌డ‌తాయి? ఫైన‌ల్‌ గా నంద్యాల బైపోల్స్ లో సానుభూతి గెలుస్తుందా? లేదంటే... రాజ‌కీయ నైతిక విలువ‌కు కేరాఫ్ అడ్రెస్‌ గా నిలిచిన జ‌గ‌న్ వైఖ‌రి విజ‌యం సాధిస్తుందా? అన్న ప్ర‌శ్న‌లు వెంటవెంట‌నే బ‌య‌ట‌కొచ్చేస్తున్నాయి.

ఈ ప్ర‌శ్న‌ల‌కు ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా స‌మాధానం చెబుతున్నా... నంద్యాల జ‌నం మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టికే ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి సంబంధించి ఓ సారి ఆ చివ‌ర నుంచి ఈ చివ‌ర వ‌ర‌కు ప‌రిశీలిద్దాం ప‌దండి. నంద్యాల ఉప ఎన్నిక‌కు కార‌ణంగా వైసీపీలో విజ‌యం సాధించి టీడీపీలో చేరిన దివంగ‌త ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణ‌మే. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే... ఆ ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని ఎమ్మెల్యేగా ఏక‌గ్రీవం చేసే సంప్రదాయం ఉంది. అయితే ఇక్క‌డ ఈ త‌ర‌హా సంప్ర‌దాయం పాటించే విష‌యంలో అటు వైసీపీతో పాటు టీడీపీ కూడా త‌మ వాద‌న‌ల‌ను వినిపిస్తున్నాయి.

భూమా నాగిరెడ్డి త‌మ పార్టీ టికెట్‌ పై నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచార‌ని, అయితే ఆయ‌న అధికార పార్టీ ప్ర‌లోభాల‌కు లొంగి పార్టీ మారార‌ని - పార్టీ మారుతున్న సంద‌ర్భంగా త‌న ప‌దవికి రాజీనామా చేయాల్సిన నైతిక‌త‌ను భూమా పాటించ‌లేద‌ని వైసీపీ చెబుతోంది. పార్టీ మారిన భూమా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెల‌వాల‌ని కూడా వైసీపీ స‌వాల్ విసిరింది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టానికి తిలోద‌కాలిచ్చిన టీడీపీ భూమా చేత రాజీనామా చేయించే విష‌యంపై అంత‌గా ఆస‌క్తి చూప‌లేద‌న్న వాద‌న కూడా వినిపించింది. ఈ క్ర‌మంలో నంద్యాల‌కు జ‌రిగే బై పోల్స్‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థినే ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌ని వైసీపీ డిమాండ్ చేసింది.

అయితే ఇందుకు విరుద్ధంగా వాదించిన టీడీపీ... వైసీపీ టికెట్‌ పై గెలిచినా భూమా త‌మ పార్టీలో ఉండ‌గా చ‌నిపోయార‌ని, ఈ కార‌ణంగా భూమా కుటుంబ స‌భ్యుడిని ఏక‌గ్రీవం చేయాల‌ని కోరింది. ఈ వాద‌న‌కు జ‌నం నుంచి అంత పెద్ద‌గా స్పంద‌నేమీ క‌నిపించిన దాఖ‌లా లేదు. అయితే ఎవ‌రి వాద‌న‌తో వారు బ‌రిలోకి దిగేశారు. అయితే ఇదే విష‌యాన్ని ఆస‌రా చేసుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప‌క్కా ప‌థ‌కం ర‌చించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... టీడీపీలో ఎమ్మెల్సీగా ఉంటూ త‌న పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు వ‌చ్చిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డితో ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో బ‌హిరంగ స‌భావేదిక‌పై ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించి త‌న నైతిక‌త‌ను చాటుకున్నారు. జ‌గ‌న్ కొట్టిన ఈ దెబ్బ‌కు టీడీపీ నిజంగానే గిల‌గిల్లాడింద‌నే వాద‌న లేక‌పోలేదు. ఎందుకంటే... వైసీపీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో 21 మందిని త‌మ‌లో చేర్చుకున్నా.. వారిలో రాజీనామా చేయించే ధైర్యం టీడీపీ చేయ‌లేక‌పోయింది కాబ‌ట్టి.

కేవ‌లం త‌న తండ్రి మ‌ర‌ణంలో ఖాళీ అయిన స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో త‌న సోద‌రుడిని గెలిపించాల‌న్న ఒకే ఒక్క వాద‌న‌తో మంత్రి భూమా అఖిల‌ప్రియ ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నారు. అదే సంద‌ర్భంలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయానికే టీడీపీని వ‌దిలామ‌ని, అయితే పార్టీ మారుతున్న సంద‌ర్భంగా త‌మకు టీడీపీ నుంచి ద‌క్కిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నామ‌ని శిల్పా బ్ర‌ద‌ర్స్ చెబుతున్నారు. ద‌మ్ముంటే... త‌మ పార్టీ టికెట్‌ పై విజ‌యం సాధించిన అఖిల‌తో పాటు మ‌రో 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాల్సిందేన‌ని వారు కాస్తంత గ‌ట్టిగానే స్వ‌రం విప్పుతున్నారు. ఈ క్ర‌మంలో అఖిల ఎంచుకున్న సానుభూతి అస్త్రానికి వీరు నైతిక‌త‌ను సంధించేశారు. ఎన్నిక‌ల పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న త‌రుణంలో ఇరు పార్టీలు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి.

మ‌రోవైపు ఇక్క‌డ విజ‌యం ఎవ‌రిద‌న్న అంశంపై అప్పుడే రాష్ట్ర‌వ్యాప్తంగా బెట్టింగ్‌ లు మొద‌లైపోయాయి. నంద్యాల ఉన్న క‌ర్నూలు జిల్లాతో పాటు క‌డ‌ప‌ - నెల్లూరు - ప‌శ్చిమ గోదావ‌రి - కృష్ణా - గుంటూరు జిల్లాల‌తో పాటు హైద‌రాబాదులోని ఈ త‌ర‌హా బెట్టింగ్ ఇప్పుడు జోరుగా సాగుతున్న‌ట్లు స‌మాచారం. బెట్టింగ్‌కు దిగుతున్న వారు నంద్యాల‌లో విజ‌యం ఎవ‌రిద‌న్న అంచ‌నాల‌పై ఏకంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నార‌ట‌. త‌మ బంధువులో, స్నేహితుల‌తో... నంద్యాల‌లో ఉన్న వారితో ఇదే విష‌యంపై వారు మాట క‌లుపుతున్నార‌ట‌. వెర‌సి నంద్యాల బైపోల్స్ ఫీవ‌ర్ ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా పాకిపోయింది.