Begin typing your search above and press return to search.

కొత్త టెన్షన్: చెన్నైకి అలాంటి ముప్పు ఉందా?

By:  Tupaki Desk   |   7 Aug 2020 4:30 AM GMT
కొత్త టెన్షన్: చెన్నైకి అలాంటి ముప్పు ఉందా?
X
నిప్పు దూరంగా ఉన్నప్పుడు దాని తీవ్రత పెద్దగా తెలీదు. కానీ.. దగ్గరయ్యే కొద్దీ అదెంత తీవ్రమైనదన్న విషయం అర్థమవుతుంది. అణుబాంబు తయారు చేసినప్పటి కంటే.. దాన్ని ప్రయోగించిన తర్వాత చోటు చేసుకునే విధ్వంసాన్ని కళ్లారా చూసినప్పుడు కానీ.. అదెంత వినాశకరమైనదన్న విషయం ప్రపంచానికి అర్థం కాలేదు. అలానే.. ప్రమాదకరమైన రసాయనాల గురించి తెలిసినా.. భారీ ఎత్తున నిల్వ ఉంచి.. అనూహ్యంగా పేలుడు చోటు చేసుకుంటే.. ఒక రాజధాని నగరం ఎంతలా ప్రభావితం అవుతుందన్న విషయం లెబనాన్ రాజధాని బీరూట్ లోని విధ్వంసాన్ని చూసిన తర్వాత కానీ అందరికి అర్థం కాలేదు.

ఈ దారుణాన్ని చూసిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడు తమ దేశాల్లోని అమ్మోనియం నైట్రేట్ నిల్వల గురించి ఆరా తీయటం మొదలెట్టాయి. అంతేకాదు.. వాటిని నిల్వ ఉంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విసయాన్ని క్రాస్ చెక్ చేయటం మొదలు పెట్టాయి. ఈ సందర్భంగా ఎంతెంత భారీ నిల్వలు పలు దేశాల్లో ఒకేచోట ఉంచుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నాయి.
బీరుట్ లో చోటు చేసుకున్న పేలుడు.. మనదేశంలోని ఏపీలోని విశాఖపట్నంతో పాటు.. తమిళనాడులోని చెన్నై పోర్టులు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే.. దేశంలోకి ఈ రసాయనం ఎక్కడి నుంచి వచ్చినా.. ఏ ప్రాంతానికి వెళ్లినా.. విశాఖ పోర్టు నుంచే అనుమతిస్తారు. దీంతో.. ఆ పోర్టులో పెద్ద ఎత్తున ఈ నిల్వలు ఉంటాయి. ఇక.. చెన్నై కథ వేరని చెబుతున్నారు.

2015 నుంచి చెన్నైలోని మనాలీ ప్రాంతంలో అమ్మోనియం నైట్రేట్ కు సంబంధించిన నిల్వలు ఉంచారు. అప్పట్లో దాని గురించి పెద్దగా పట్టించుకోని వారు.. బీరుట్ ఉదంతం తర్వాత ఒక్కసారిగా ఉలిక్కి పడటమే కాదు.. తీవ్రమైన టెన్షన్ కు గురవుతున్నారు. ఎందుకంటే.. మనాలిలో 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రిట్ నిల్వలు ఉన్నాయి. వాటి కారణంగా ఏమైనా ప్రమాదం జరుగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. అధికారులు మాత్రం అలాంటి భయాలు అక్కర్లేదని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకీ ఈ భారీ పరిణామంలో ఈ రసాయనం అక్కడికి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. 2015 ప్రాంతంలో తమిళనాడులోని కరూర్ కి చెందిన ఒక కంపెనీ అమ్మోనియం నైట్రేట్ ను ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేశారు. దీన్ని కస్టమ్స్ శాఖ వారు సీజ్ చేసి.. మనాలీ సమీపంలో నిల్వ ఉంచారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో అక్కడే ఉండిపోయింది. తాజాగా బీరూట్ పేలుడు ఘటనతో ఒక్కసారి ఉలిక్కిపడిన అధికారులు.. 2015 నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడా నిల్వల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తనిఖీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. భారీ ఎత్తున ఉన్న ఈ ప్రమాదకర రసాయనం అక్కడి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.