Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై భారీ ఆరోపణ చేసిన రైతు ఉద్యమ నేత

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:30 AM GMT
కేసీఆర్ పై భారీ ఆరోపణ చేసిన రైతు ఉద్యమ నేత
X
ఊహించని పరిణామం అంటే ఇదేనేమో? మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పి.. రైతుల వెన్ను విరిచేలా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఉద్యమించి.. దేశ వ్యాప్తంగా సుపరిచితుడిగా మారిన రైతు నేత రాకేశ్ టికాయత్. భారతీయ కిసాన్ యూనియన్ నేతగా గుర్తింపు పొందిన ఆయన తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.

రైతు ఉద్యమంపై చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. మొత్తంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనగా మారటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయనున్నాయి.

ఇంతకీ ఆయన చేసిన ఆరోపణల్లో ముఖ్యమైనది.. రాజకీయంగా అత్యంత కీలకమైనది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువగా మద్దతు ఇస్తోందన్నారు. ఈ విషయం దేశ ప్రజలందరికి తెలుసంటూ.. కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఆరోపణల్ని సంధించారు. బీజేపీకి టీఆర్ఎస్ మాత్రమే కాదు అసద్ అధినేతగా ఉన్న మజ్లిస్.. ఏపీ సీఎం జగన్ కూడా బి టీంలుగా అభివర్ణించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సాగు చట్టాలకు వ్యతిరేకమని చెబితే నమ్మలేమన్నారు.

రైతు ఉద్యమంపై టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలన్న ఆయన.. రైతుల విషయంలో బీజేపీ నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోందన్నారు. ఆంబానీ.. అదానీల ఆదేశాలతో సంఘ్ పరివార్ పని చేస్తుందన్నారు. బీజేపీకి కిసాన్ సంయుక్త్ మోర్చా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆ మాటకు వస్తే తాముఏ పార్టీకి మద్దతు ఇవ్వమని.. దేశం కోసమే మోర్చా పని చేస్తుందన్నారు.

ధర్నా చౌక్ లో మహా ధర్నాలో పాల్గొన్న రాకేశ్ తికాయత్.. అనంతరం సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ శివారులో నిర్వహించిన రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రస్తావించిన ఆయన.. తెలంగాణలో కూడా మరణించిన రైతు కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు.

వ్యవసాయ చట్టాలకువ్యతిరేకంగా గళం విప్పిన ఉద్యమంలో 750 మంది రైతులు ప్రాణాలు పోయాయని.. వారి కుటుంబాల్ని ఆదుకోవాల్సిన బాద్యత దేశంలోని అన్ని రాష్ట్రాలదన్నారు. దేశంలో రైతులు పండించే ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ గా తేల్చిన ఆయన.. ఆ మేరకు చట్టం రావాల్సి ఉందన్నారు. ఈ నెల 29 నుంచి ప్రతి రోజు 500 ట్రాక్టర్లతో రైతులు పార్లమెంటుకు రానున్నట్లు చెప్పారు.