Begin typing your search above and press return to search.

హీరో బ‌ర్త్‌డే సంబ‌రం: పోలీస్ కేసు

By:  Tupaki Desk   |   14 Jan 2016 9:24 AM IST
హీరో బ‌ర్త్‌డే సంబ‌రం: పోలీస్ కేసు
X
రీల్ హీరోలు రియ‌ల్ హీరోలుగా స‌మాజానికి ఆద‌ర్శంగా నిల‌వాల్సింది పోయి వివాదాల‌కు కార‌ణ‌మ‌య్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ సంతోషాల‌కు, సంబరాల‌కు సామాన్యుల‌ను ఇబ్బందిపెడుతూ ఆగ్ర‌హాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. సాధారణంగా సున్నితంగా వ్య‌వ‌హ‌రించే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇపుడు వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా త‌న సంతోషం కోసం ఇత‌రులను స‌మ‌స్య‌లు పాలు చేయ‌డం వ‌ల్ల కావ‌డం ఆస‌క్తిక‌రం.

హృతిక్ త‌న 42వ పుట్టిన రోజు సంబ‌రాన్ని అట్టహాసంగా నిర్వహించాడు. అస‌లే పుట్టిన రోజు పైగా జ‌రిగింది వీకెండ్ అయిన శ‌నివారం రోజు అందులోనూ ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబైలోని ప్రముఖ హోటల‌లో టాప్ హోట‌ల్ అయిన ఫోర్ సీజన్స్. ఇంతే కాదు హోట‌ల్‌లోని 34 వ అంతస్తులో బ‌ర్త్‌డే బాష్ నిర్వ‌హించ‌డం ద్వారా మ‌రింత క్రేజ్ పెంచారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే...త‌మ‌తో స‌మాన‌మైన టాప్ హీరో హృతిక్ పుట్టిన‌రోజు కాబ‌ట్టి బాలీవుడ్ సూపర్ స్టార్లంతా విచ్చేశారు. అభిషేక్ బచ్చన్, షారుఖ్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, దీపికా పడుకొనే, ప్రీతిజింటా, శిల్పాశెట్టి, కరణ్ జోహార్, తదితర హీరోహీరోయిన్లంతా విచ్చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. అర్థరాత్రి మొదలైన పార్టీ మరునాడు 3.30 దాకా సాగిందంటే బాలీవుడ్ అగ్ర‌న‌టులు ఎంత‌గా హంగామా అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే డీజే శ‌బ్దాలు, బాలీవుడ్ దిగ్గ‌జాల కేక‌లు- స్టెప్పుల‌తో ఆ హోట‌ల్ ఉన్న ప్రాంత‌మంతా హోరెత్తిపోయింది. స్థానికుల‌కు మ‌నశ్శాంతి క‌రువుచేసింది. ఈ క్ర‌మంలోనే అష్రఫ్ ఖాన్ అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే ఎంతైనా సెల‌బ్రిటీలు క‌దా. ఎప్ప‌ట్లాగే పోలీసులు పట్టించుకోలేదు. హీరో పార్టీకి అడ్డుక‌ట్ట వేయ‌లేదు. దీంతో విపరీతమైన శబ్దాలతో, మ్యూజిక్ తో పార్టీ కొనసాగింది. దీంతో అష్ర‌ఫ్‌కు కాలిపోయింది. ఈ సారి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డ‌మే కాకుండా రాత్రి పదిగంటల తరువాత అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు నిర్వహించడం నేరమంటూ రూల్స్ చెప్పాడు. ఇపుడు చ‌ర్య‌లు తీసుకోవాలి లేదంటే కేస్ బుక్ చేయాల‌ని వాదించాడు.

అప్పుడు పోలీసుల‌కు అర్థ‌మ‌యింది. సీన్ మారిపోతోంద‌ని గ‌మనించి రంగంలోకి దిగి హోట‌ల్ ఓన‌ర్‌కు పాతిక వేల జరిమానా విధించారు. ఇలా బ‌ర్త్‌డే ఆనందాన్ని మూట‌గ‌ట్టుకోవాల్సిన హృతిక్ అన‌వ‌స‌ర వివాదాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంతేకాదు ఈ క్ర‌మంలో ఉద్దేశ‌పూర్వ‌కంగా హీరోకు స‌పోర్ట్ చేశారంటూ పోలీసుల‌ను వివాదాల పాలుచేశాడు.