Begin typing your search above and press return to search.

ఈ ప్యాకేజీ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంత ఉప‌యోగం?

By:  Tupaki Desk   |   29 Jun 2021 9:00 PM IST
ఈ ప్యాకేజీ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంత ఉప‌యోగం?
X
క‌రోనాతా కుదేలైన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు అంటూ.. తాజాగా ..కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ప్యాకేజీ ప్ర‌క‌టించింది. సుమారు 6 ల‌క్ష‌ల పైచిలుకు కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌క‌టించిన ఈ ప్యాకేజీ.. నిజంగానే వెంటిలేట‌ర్‌పై ఉన్న‌ దేశ ఆర్థిక రంగానికి ఆక్సిజ‌న్ అందించ‌గ‌ల‌దా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. లెక్క‌కు మిక్కిలిగా.. జ‌న‌సంప‌ద‌ను పోగేసుకున్న అభివృద్ధి చెందుతున్న దేశంలో మౌలిక స‌దుపాయాలే నామ‌మాత్రంగా ఉన్న వైద్య రంగాన్ని ప‌రిపుష్టం చేసేందుకు 23 వేల కోట్ల‌ను మాత్ర‌మే కేటాయించ‌డాన్ని బ‌ట్టి.. ఈ ప్యాకేజీ ఫ‌లితం.. ఎలా ఉంటుంద‌నేది ఆర్థిక నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇదో విదిలింపు.. అంతే!
క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దేశం మొత్తం.. మూడు ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటోంది. ఒక‌టి ప్ర‌జారోగ్య‌ రంగం, రెండు ఆర్థిక రంగం, మూడు ఉపాధి. ఉదార నిధుల విడుద‌ల‌తో ఈ మూడు రంగాల‌ను ఆదుకోవాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం.. విదిలింపులే త‌ప్ప‌.. ఎక్క‌డా.. ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ చూప‌క‌పోవ‌డం క‌రోనా కంటే ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణమించింద‌ని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు క‌రోనా మిగిల్చిన న‌ష్టాల నుంచి కోలుకునేందుకు క‌నీసం.. కొన్ని సంవ‌త్సరాల స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో మ‌రింత‌గా ప్ర‌గతి రథం ప‌ట్టు త‌ప్పే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. దీనిని గ్ర‌హించి.. ఉదార విధానాన్ని అనుస‌రించ‌డం అత్య‌వ‌స‌ర‌మ‌ని నిపుణులు చూస్తున్నారు.

ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేదీ?
ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా ఇప్పటికే రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించగా.. తాజాగా రూ.6,28,993 కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో, కొవిడ్‌తో ప్రభావితమైన రంగాలను ఆదుకోవడానికి ఎనిమిది రకాల పథకాలను వెల్లడించారు. వీటిలో నాలుగు కొత్తవి కాగా.. ఇందులో ఒకటి ప్రత్యేకంగా ఆరోగ్య రంగానికి సంబంధిం చినది. అలాగే, రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకంతోపాటు ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీం(ఈసీఎల్‌జీఎస్‌) కింద మరో రూ.1.5 లక్షల కోట్లను ప్రకటించారు. అయితే.. ఈ రుణాల‌ను ఎవ‌రికి ఇస్తారు? అనే విష‌యంపై క్లారిటీ లేదు. ఎన్నాళ్ల వ‌ర‌కు ఇస్తారు? అనేది కూడా చెప్ప‌లేదు. సో.. ఇది పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు నిరుద్యోగుల‌కు ఎలాంటి ల‌బ్ధి చేకూరుస్తుంద‌నేది.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఈ నిధులు ఏమూల‌కు?
రూ.50 వేల కోట్లను వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను విస్తరించడానికే కేటాయించారు. అయితే.. వీటిని నేరుగా రాష్ట్రాల‌కు ఇచ్చేదీ లేనిదీ ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. ఈ పథకం కింద 7.95 శాతం వడ్డీని మించకుండా గరిష్ఠంగా రూ.100 కోట్ల రుణాన్ని అందిస్తారు. అంటే.. రాష్ట్రాలు అప్పులు చేసుకోవాల్సిందేనా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇవి కాకుండా మరో రూ.23,200 కోట్లను ప్రజారోగ్యానికి కేటాయించారు. ఇందులో రూ.15 వేల కోట్లతో ఎమర్జెన్సీ హెల్త్‌ సిస్టమ్స్‌ ప్రాజెక్టును ప్రకటించారు. కానీ, ఈ నిధులు కూడా కంటితుడుపు చ‌ర్య‌లే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

అప్పులు ఇస్తారట‌
రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకంలోని మిగిలిన రూ.60 వేల కోట్లను ఇతర రంగాలకు కేటాయించారు. పథకంలో భాగంగా, సూక్ష్మ ఆర్థిక సంస్థల నుంచి పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. దీని ద్వారా దాదాపు 25 లక్షల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంద‌ని నిర్మ‌ల‌పేర్కొన్నారు. కానీ ఇత‌మిత్థం గా చూస్తే.. దేశ జ‌నాభాలో .. పోనీ సూక్ష్మ పారిశ్రామిక రంగంలో ఈ 25 ల‌క్ష‌ల మందే ఉన్నారా? మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి? అనేది కేంద్రం ఆలోచించ‌లేదు. ఇక‌, పేద‌ల‌కు ఇస్తున్న బియ్యాన్ని కూడా లెక్క‌క‌ట్టుకుని రెండు ల‌క్ష‌ల కోట్ల లెక్క చూపించారు.

కేంద్రం చేసేది `రుణ` సాయ‌మే
మొత్తంగా తాజా ప్యాకేజీని చూస్తే..కేంద్రం చేస్తోంది ఏదైనా ఉందంటే. అది కేవ‌లం .. రుణ సాయ‌మే త‌ప్ప‌.. మ‌రేమీ క‌నిపించ‌డం లేదు. ఆసుప‌త్రుల‌కు రుణాలు ఇస్తారు. సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలు ఇస్తారు. ఉద్యోగుల‌కురుణాలు ఇస్తారు. అంటే.. మొత్తంగా ప్ర‌జ‌ల‌నురుణ గ్ర‌స్తుల‌ను చేయ‌డ‌మే ఈ ప్యాకేజీ ల‌క్ష్యంగా మారింది త‌ప్ప‌.. ఉచితంగా ఎంతో కొంత సాయం ప్ర‌క‌టించాల‌నే ఉద్దేశం ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఇదీ.. తాజాగా నిర్మ‌ల‌మ్మ చేసిన ప్యాకేజీ ప్ర‌సంగంలోని సారాంశం.