Begin typing your search above and press return to search.

ఇదెంత అన్యాయం మోడీసాబ్? మీ రాజ్యంలో ఇలా జరగటమా?

By:  Tupaki Desk   |   29 April 2022 5:06 AM GMT
ఇదెంత అన్యాయం మోడీసాబ్? మీ రాజ్యంలో ఇలా జరగటమా?
X
కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత దేశానికి ఎలాంటి మేలు జరిగిందంటూ పలువురు ఈ మధ్యన అదే పనిగా ప్రశ్నించటం చూస్తూనే ఉంటాం. మోడీకి ముందు ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ కాలానికి మోడీ హయాంకు తేడా ఏమిటంటూ అధికారిక వర్గాల్లోని అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారిని అడిగితే.. వారి నుంచి వచ్చే సమాధానం ఆసక్తికరంగా ఉంటుంది.

మన్మోహన్ మాత్రమే కాదు.. గడిచిన కొన్నేళ్లుగా ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారి కాలంతో పోల్చినా మోడీ ప్రభుత్వంలో అధికారుల పని తీరులో పూర్తి మార్పు వచ్చినట్లుగా చెబుతారు. అయితే.. ఇలాంటి వాదనలకు భిన్నంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే.. మోడీ రాజ్యంలో కూడా ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తారా? అన్న ప్రశ్న తలెత్తకుండా ఉండదు.

పద్మశ్రీ గ్రహీత ప్రముఖ ఒడిస్సీ నృత్యకళాకారుడు గురు మయధర్ రౌత్ కొన్నేళ్లుగా ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజీలో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతో పాటు పలువురు కళాకారులకు అప్పట్లో ఇలాంటి వసతిని కల్పించారు. ఢిల్లీలోని ఏషియన్స్ గేమ్స్ విలేజీలో కేటాయించిన ఇంట్లో ఆయన ఉండగా.. 2014లో కేంద్రం నోటీసులు జారీ చేసి.. ఈ వసతిని రద్దు చేసింది. దీంతో చాలామంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలి ఉన్న వారు ఈ నెల 25లోపు ఖాళీ చేయాలని ఆదేశించారు.

అయితే.. మయధర్ మాత్రం ఇంటిని ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు స్వయంగా వచ్చి ఆయన ఇంటిని ఖాళీ చేశారు. ఇంట్లోని సామాన్లను వీధిలో పెట్టేసి 90 ఏళ్ల పెద్ద వయస్కుడైన కళాకారుడ్ని నడిరోడ్డు మీద నిలబెట్టిన వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఆయనకు ఇచ్చిన పద్మ పురస్కారం సైతం రోడ్డుపై పడి ఉన్న వైనం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఈ ఉదంతంలో కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై మయధర్ కుమార్తె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం రెండు గంటల వేళలో ఇంటి బెల్ మోగిందని.. అప్పుడే తన తండ్రికి తాను అన్నం పెడుతున్నానని.. పోలీసులు.. ఆ వెంటనే కూలీలు ఇంట్లోకి వచ్చి రెండు నిమిషాలు కూడా గడువు ఇవ్వకుండానే ఇంట్లోని సామాన్లను వీధిలో పెట్టేశారని చెప్పారు. తాను ఉండటంతో తన తండ్రి షాక్ గురైనప్పటికి కోలుకున్నారని.. లేకుంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని వాపోయారు.

తన నాట్యంతో ఎంతో సేవలు అందించిన ఆయనకు ఇలాంటి అవమానం జరగటం బాధాకరమన్నారు. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవని.. ఇలాంటి అవమానం ప్రపంచంలో మరే కళాకారుడికైనా జరుగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయించటం చట్టపరంగా సరైనదే అయినప్పటికీ అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉందన్నారు. 90 ఏళ్ల వయసులో పద్మ పురస్కార గ్రహీత అయిన ఒక కళాకారుడి విషయంలో ఇలా జరగటం మాత్రం.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇలాంటి వ్యవహారాల్లో అధికారులు వ్యవహరించాల్సిన తీరు మాత్రం ఇలా అయితే అస్సలు ఉండకూడదు.