Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ అన్ని మాయేనా?

By:  Tupaki Desk   |   21 May 2019 5:52 AM GMT
ఎగ్జిట్ పోల్స్ అన్ని మాయేనా?
X
ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల‌య్యాయి. మోడీకే మ‌ళ్లీ ప‌ట్ట‌మ‌ని తేల్చేశాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఏ ఎగ్జిట్ పోల్ చూసినా.. ఎన్డీయేకు 280-290 సీట్ల కంటే త‌క్కువ ఇచ్చిన స‌ర్వే సంస్థ ఒక్క‌టి క‌నిపించ‌దు. మోడీ నేతృత్వంలో మ‌రోసారి ఎన్డీయే ప్ర‌భుత్వం ప‌క్కా అన్న‌ట్లుగా స‌ర్వే రిపోర్టులు స్ప‌ష్టం చేశాయి.

ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్ స‌ర్వేల‌న్ని జిమ్మిక్కేన‌ని.. మాయేన‌ని.. న‌మ్మ‌టానికి వీల్లేద‌న్న వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు కొన్ని రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను ఎవ‌రూ త‌ప్ప‌ప‌ట్ట‌ట్లేదు కానీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల విష‌యంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బీజేపీ గెలుపు ధీమా అంతా ఉత్త‌దేన‌ని.. విప‌క్షాల్ని సైడ్ ట్రాక్ ప‌ట్టించేందుకు మోడీ చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణిస్తున్నారు. మోడీ గెలుపు ఖాయ‌మ‌న్న భావ‌న‌ను బ‌లంగా వ్యాపింప‌చేయ‌టం ద్వారా.. కౌంటింగ్ రోజున ఆక్ర‌మాల‌కు పాల్ప‌డేలా చేయ‌టం ఆయ‌న ఉద్దేశమ‌న్న విమ‌ర్శ ఒక‌టి ప‌లు వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.

పోల్ స‌ర్వేల్లో పేర్కొన్న‌ట్లుగా బీజేపీకి బ‌లం ఉన్న ప‌రిస్థితి క‌నిపించ‌ట్లేదంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లాంటి చోట్ల బీజేపీకి వ‌చ్చే సీట్ల లెక్క‌ను భారీగా పెంచేసి చూపించారంటున్నారు. దీనికి నిద‌ర్శ‌నంగా తెలంగాణ‌లో మూడు సీట్లు బీజేపీకి వ‌స్తాయ‌న్న లెక్కను చూపిస్తున్నారు.

తెలంగాణ‌లో బీజేపీ గెలుపు అవ‌కాశాలు ఉన్నవి రెండు చోట్ల మాత్ర‌మే. ఒక‌టి క‌రీంన‌గ‌ర్ అయితే..రెండోది సికింద్రాబాద్‌. కానీ..ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనూ.. పోలింగ్ చివ‌రి రెండు గంట‌ల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ న‌మోదు కావ‌టం.. అది ఏడెనిమిది శాతంగా న‌మోదు కావ‌టంతో టీఆర్ ఎస్ గెలుపు ప‌క్కా అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ‌.. తెలంగాణ‌లో బీజేపీ మూడు సీట్లు గెలుస్తుంద‌న్న‌ది చూపిస్తున్న‌ప్పుడు.. మిగిలిన రాష్ట్రాల్లో ప్ర‌తి రాష్ట్రానికి కాస్త‌.. కాస్త పెంచుకుంటూ పోకూడ‌ద‌న్న రూల్ ఏమైనా ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ లాజిక్ ప్ర‌కారం చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ పై కొత్త సందేహాలు వ్య‌క్తం కావ‌టం ఖాయం. ఈ కార‌ణంతోనే విప‌క్షాలు మోడీ మ‌ళ్లీ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ఉందంటూ వెల్ల‌డైన పోల్ స‌ర్వేల‌ను అస్స‌లు న‌మ్మ‌ట్లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విప‌క్షాల అంచ‌నా క‌రెక్టా? ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు స‌రైన‌వా? అన్న‌ది తేలాలంటే.. 23 మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.