Begin typing your search above and press return to search.

వెంక‌య్య వేటు వేసేనా?

By:  Tupaki Desk   |   16 Aug 2021 2:30 PM GMT
వెంక‌య్య వేటు వేసేనా?
X
ప్ర‌జ‌స్వామ్యానికి గుడి లాంటి పార్ల‌మెంటులో కొంత‌మంది ఎంపీల వ్య‌వ‌హార శైలి బాధ‌పెడుతోంద‌ని.. రాజ్య‌స‌భ స‌భ్యుల్లో కొంత‌మంది ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ఆవేద‌న‌తో క‌న్నీళ్లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అదే నిజం కాబోతుంద‌నే అనుమానాలు పెరుగుతున్నాయి. స‌భా మ‌ర్యాద‌ను పాటించ‌ని ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై వేటు వేయాల‌ని ఏడుగురు కేంద్ర మంత్రులు వెంక‌య్య నాయుడిపై తీవ్ర‌మైన ఒత్తిడి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ఈ ఉప రాష్ట్రప‌తి ఎలా న‌డుచుకుంటారో చూడాలి.

ఈ నెల 11న రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కొంత‌మంది ఎంపీలు పోడియం ద‌గ్గ‌ర ఉద్యోగులు కూర్చునే బెంచీల మీద‌కు ఎక్కి నానా ర‌భస చేశారు. ఆ స‌మ‌యంలో మార్ష‌ల్స్‌కు ఎంపీల‌కు మధ్య తోపులాట‌లు జ‌రిగాయి. మార్ష‌ల్స్‌ను ఎంపీలు కొట్టార‌ని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా.. లేదు మార్ష‌ల్సే త‌మ‌పై దాడి చేశారంటూ ప్ర‌తిప‌క్షాల ఎంపీలు అంటున్నారు. బ‌య‌ట వ్య‌క్తుల‌ను మార్ష‌ల్స్ రూపంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌భ‌లోకి ర‌ప్పించిందంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై మాత్రం వెంక‌య్య‌నాయుడిపై ఒత్తిడి పెరుగుతోంది. స‌భ‌లో ఆ గొడ‌వ జ‌రిగిన రెండో రోజే నుంచే ఆ ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏడుగురు కేంద్ర‌మంత్రులు వెంక‌య్య నాయుడును డిమాండ్ చేశారు. తాజాగా ఇదే అంశంపై మ‌రోసారి వెంక‌య్య నాయుడును క‌లిసి గ‌ట్టిగా కోరారు. దీన్ని బ‌ట్టి చూస్తే ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై కేంద్ర‌మంత్రులు ఓ వ్యూహం ప్ర‌కారం న‌డుచుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

రాజ్య‌స‌భ‌లో మోడీ అధికారంలోని ఎన్డీయే ప్ర‌భుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. దీంతో బిల్లులు పాస్ చేయించుకునే విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొంత‌మంది మంది ఎంపీల‌పై వేటు ప‌డితే.. అప్పుడు ప్ర‌తిప‌క్షాల బ‌లం త‌గ్గుతుంది. స‌భ‌లో బిల్లులు పాస్ చేయించుకోవ‌డానికి ప్ర‌భుత్వం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. అందుకే ఆ ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వెంక‌య్య నాయుడిని డిమాండ్ చేస్తున్నారని విశ్లేష‌కులు అంటున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఆ గొడ‌వ‌కు సంబంధించిన వీడియోల‌ను డిప్యూటీ ఛైర్మ‌న్ హ‌రివంశ్‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. సోమ‌వారం కూడా మ‌రోసారి ప‌రిశీలించనున్నారు. ఆ త‌ర్వాత ఘ‌ట‌న‌కు సంబంధించిన నివేదిక‌ను రాష్ట్రప‌తికి సిఫార‌సు చేస్తార‌ని స‌మాచారం. అయితే స‌భ‌లో పార్టీల బ‌లాబ‌లాలు చూసుకున్న త‌ర్వాతే ఈ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మయ్యే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ చ‌ర్య‌లు తీసుకున్న అవి ఎప్ప‌టివ‌ర‌కూ అమ‌ల్లో ఉంటాయ‌నేది కూడా చూసుకోవాలి. దీనిపై ఓ స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే.