Begin typing your search above and press return to search.

అంతమందిని దాటుకొని శాంతికుమారి ఎలా ఫైనల్ అయ్యారు?

By:  Tupaki Desk   |   12 Jan 2023 7:30 AM GMT
అంతమందిని దాటుకొని శాంతికుమారి ఎలా ఫైనల్ అయ్యారు?
X
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్ గంటల వ్యవధిలో తన పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం రావటం.. ఏపీకి వెళ్లటం ఖాయం కావటం తెలిసిందే. దీంతో.. సోమేశ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసుకునే విషయంలో భారీ కసరత్తు జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ రేసులోకి బోలెడన్ని పేర్లు వచ్చాయి. వాటన్నింటిని దాటుకొని.. చివరకు సీఎస్ గా బాధ్యతలు చేపట్టే అరుదైన అవకాశాన్ని శాంతికుమారి సొంతం చేసుకున్నారు. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆమె తన కెరీర్ ను 1991లో షురూ చేశారు. అంటే.. థర్టీ ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ అన్న మాట.

కొత్త సీఎస్ ఎవరన్న మాట వినిపించినంతనే తెర మీదకు వచ్చిన పేర్లు చాలానే వచ్చాయి. వాటిల్లోరజత్‌కుమార్‌, కె.రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌, సునీల్‌ శర్మ, రాణి కుముదిని పేర్లుప్రముఖంగా వినిపించాయి. వీరి పేర్ల తర్వాతనే శాంతికుమారి పేరు వినిపించింది. అయితే.. జాబితాలో తన కంటే ముందున్న పేర్లకు సంబంధించిన నెగిటివ్ అంశాలు శాంతికుమారికి ప్లస్సులుగా మారాయి. కొన్నిసార్లు కాలం కలిసి రావటం అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. శాంతికుమారి విషయంలో అదే నిజమైందని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అడవులు.. పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమె.. తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికి మేడమ్ బాస్ కానున్నారు.

ఇక.. రేసులో ఉన్న వారు ఎలా వెనక్కి వెళ్లిపోయారన్న విషయాన్ని చూస్తే.. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ ఇలానే జరుగుతాయన్న భావన కలుగక మానదు. జాబితాలో వినిపించిన రజత్‌కుమార్‌, కె.రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌, సునీల్‌ శర్మ, వసుధా మిశ్రా, రాణి కుముదిని వారి విషయాల్లోకి వెళితే..

వసుధా మిశ్రా

1987 బ్యాచ్ కు చెందిన ఆమె.. సీఎస్ ఎంపికలో అందరికంటే సీనియర్. అయితే.. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వచ్చే నెలలోనే రిటైర్ కావాల్సి ఉంటుంది. అలాంటి వేళలో.. హడావుడిగా కేంద్ర సర్వీసుల్ని తీసుకొచ్చి.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టటంలో అర్థం లేదన్న ఉద్దేశంతో మొదట్లోనే ఆమె పేరును పక్కన పెట్టేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

రాణి కుముదిని

1988 బ్యాచ్ కు చెందిన రాణి కుముదిని ప్రస్తుతం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆమె రిటైర్ కానున్నారు. అంటే.. సీఎస్ గా ఆమెకు బాధ్యతలు అప్పజెబితే.. ఆర్నెల్లకే మరో సీఎస్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆమె బాధ్యతలు చేపట్టి.. అందులో సెట్ అయ్యేసరికే నెల పడుతుంది. మరి.. ఐదు నెలలకే రిటైర్ కావాల్సి ఉండటంతో ఆమె ప్రాధాన్యతను కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది.

రజత్ కుమార్

ఈ సీనియర్ ఐఏఎస్ అధికారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంచి అనుబంధం ఉంది. అయితే.. ఆయన తన కుమార్తె పెళ్లి విషయంలో పెట్టిన ఖర్చు ఆ మధ్యన పెను సంచలనంగా మారి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. రజత్ కుమార్ మీద పలు ఆరోపణలు ఉండటం కూడా ఆయనకు మైనస్ అయ్యింది. దీనికి తోడు ఆయన బిహార్ కు చెందిన వారు కావటం కూడా శాపమైంది.తెలంగాణ రాష్ట్రంలో బిహారీ అధికారుల హవా నడుస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ ప్రస్తావిస్తున్నవేళ.. బిహార్ కు చెందిన సోమేశ్ స్థానంలో మరో బిహార్ అధికారికి సీఎస్ ఇవ్వటం ఇష్టం లేకనే ఆయన పేరును పక్కన పెట్టేసినట్లుగా చెబుతున్నారు.

అర్వింద్ కుమార్

ప్రస్తుతం ఆయన పలు కీలక శాఖల్లో పని చేస్తూ.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ.. ఆయన కూడా బిహార్ కు చెందిన వారు కావటం మైనస్ గా మారిందంటున్నారు. ఇక.. రామక్రిష్ణారావు.. సునీల్ శర్మ విషయాల్లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకొని వారిని ఎంపిక చేయలేదన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో శాంతికుమారితో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసి ఉండటం. ఆమె పని తీరు మీద ఆయనకు అవగాహన ఉంది. దీనికి తోడు సీఎంవోలోనూ ఆమె పని చేశారు. దీనికి తోడు ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన కాపు/మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఆమె పేరును ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.