Begin typing your search above and press return to search.

దళితబంధు లబ్థిదారుల్నిఎంత సీక్రెట్ గా సభ వద్దకు తీసుకొచ్చారంటే?

By:  Tupaki Desk   |   17 Aug 2021 10:20 AM IST
దళితబంధు లబ్థిదారుల్నిఎంత సీక్రెట్ గా సభ వద్దకు తీసుకొచ్చారంటే?
X
అంచనాలకు మించిన రీతిలో దళితబంధు పథకం అమలు ఉంటుందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటం తెలిసిందే. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన దళితబంధు పథకం అమలుకు వీలుగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకానికి సంబంధించి పదిహేను మంది లబ్థిదారుల్నిఎంపిక చేశారు. సీఎం చేతుల మీదుగా చెక్కుల్ని తీసుకునేందుకు ఎంపిక చేసిన వైనం టాప్ సీక్రెట్ మాదిరి ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఒక భారీ పథకానికి సంబంధించిన లబ్థిదారుల్ని అంత రహస్యంగా ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అంతేకాదు.. లబ్థిదారుల్ని సభ వద్దకు తీసుకొచ్చేందుకు అధికారులు వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా మారింది.

హుజూరాబాద్ లో ఎంపిక చేసిన పదిహేను మంది లబ్థిదారుల జాబితాను అధికారులు బయటకు వెల్లడించలేదు. గుట్టుగా ఉంచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లబ్థిదారుల ఎంపికకు సంబంధించిన వారికి ఆదివారం రాత్రి వేళలో సమాచారం అందించారని.. ప్రత్యేక ఏర్పాట్లతో సభ వద్దకు తీసుకెళతామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. లబ్థిదారులు ఎవరూ తమకు సమాచారం వచ్చిందన్న విషయాన్ని ఎవరికి తెలియజేయొద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్లే సీక్రెట్ గా ఉంచిన ఈ అంశం.. సభ ప్రారంభమై.. లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చే వరకు.. వారు ఎవరన్న విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం.

సోమవారం ఉదయమే అధికారులు వాహనాలు తీసుకెళ్లి.. లబ్థిదారుల ఇళ్లకు వెళ్లారు. వారిని.. వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేక వాహనాల్లో సభ వద్దకు తీసుకెళ్లారు. మిగిలిన వారంతా ఉన్న మార్గంలో కాకుండా.. వారు ఎవరి కంటా పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. వీఐపీ మార్గంలోకి తీసుకెళ్లి.. వేదిక పైకి తీసుకెళ్లారు. భారీ పథకానికి సంబందించిన లబ్థిదారుల ఎంపిక ఇంత సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.