Begin typing your search above and press return to search.

భారత్ లో ఐటీ ఉద్యోగం ఏమేరకు 'సేఫ్'..!

By:  Tupaki Desk   |   11 Dec 2022 11:30 PM GMT
భారత్ లో ఐటీ ఉద్యోగం ఏమేరకు సేఫ్..!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలంతా మునుపటిలా తమ తమ పనులు చేసుకుంటున్నారు. అయితే కరోనా ప్రభావం నుంచి మాత్రం ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అర్థమవుతోంది. కరోనా ధాటికి కొన్ని రంగాలు పూర్తిగా కుదేలు కాగా మరికొన్ని రంగాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ఈ కాలంలోనూ హెల్త్.. ఫార్మా.. ఓటీటీ రంగాలు గతంలో కంటే ఎక్కువ గ్రోత్ ను చూపించి మార్కెట్ ను శాసించాయి. అయితే రెస్టారెంట్.. హోటల్.. పర్యాటక.. థియేటర్స్.. సినిమా తదితర రంగాలు పూర్తి స్థాయిలో కుదేలుగా ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా ప్రభావం ఐటీ రంగంపై మిశ్రమంగా ఉంది.

అమెరికా లాంటి దేశాల్లో ఐటీ రంగం బాగా దెబ్బతినగా భారత్ లో మాత్రం దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఈ ఏడాది 1391 సార్లు ఉద్యోగుల తొలగింపులు చేశాయి.

ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 9 వరకు టెక్ కంపెనీలు 2 లక్షల18 వేల 324 మంది ఉద్యోగులు తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పేలవ ప్రదర్శనకు తోడు ఇటీవల ప్రకటనలపై వచ్చే ఆదాయం భారీగా పడిపోవడంతో టెక్ కంపెనీలు ఉద్యోగులను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బడా కంపెనీలన్నీ వరుసబెట్టి ఉద్యోగులకు ఇంటికి పంపుతున్నాయి.

అమెరికాలోని బడా ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు విషయంలో పోటీ పడుతున్నాయి. మేటా.. అమెజాన్.. బైజూర్.. ట్విట్టర్ కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. అయితే భారత్ లోని యాక్సెంచర్ ఇండియా తన ఉద్యోగుల్లో 60వేల మంది ప్రమోషన్స్ ఇచ్చింది.

విప్రో.. ఇన్ఫోసిస్.. హెచ్సీఎల్.. టీసీఎల్ లాంటి కంపెనీలు ఈ ఏడాది లక్ష మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే మాంద్యం కారణంగా 52 స్టార్టప్ కంపెనీలు 17వేల 604 మందిని తొలగించాయి. ఈ జాబితాలో బైజూస్.. ఛార్జ్ బీ.. కార్స్ 24.. మీ షో.. ఓలా.. ఉడాన్.. అనకాడెమీ..వేదాంత్ లాంటి విద్య.. సాంకేతిక స్టార్టప్స్ ఉన్నాయి.

ప్రస్తుతానికి భారత్ లోని ఐటీ కంపెనీల్లో పెద్దగా తొలగింపులేమీ కన్పించడం లేదు. అయితే అమెరికాలో ఐటీ ఉద్యోగులను వరుసగా తొలగిస్తున్న నేపథ్యంలో 2023లో భారత్ లోనూ ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది భారత ఆర్థిక పరిస్థితిని బట్టి ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉండే అవకాశం కన్పిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.