Begin typing your search above and press return to search.

మనలో చాలామంది చేసే ఈ తప్పు మీరు చేయొద్దు

By:  Tupaki Desk   |   21 May 2021 10:09 AM IST
మనలో చాలామంది చేసే ఈ తప్పు మీరు చేయొద్దు
X
కరోనా వేళ వస్తున్న సందేహాలు అన్ని ఇన్ని కావు. చూసేందుకు చాలా చిన్నవిగా.. వినేందుకు సిల్లీగా ఉన్నట్లు అనిపిస్తున్నా.. రోజువారీ జీవితంలో కీలకమైన ఈ అంశాల విషయంపై శాస్త్రీయ అవగాహన లోపించి.. సమస్యల బారిన పడే వారెందరో. మాస్కును ఎన్నిసార్లు వాడాలన్న దానిపై ఎవరికి వారు తమకు తోచింది చెప్పటమే కానీ.. శాస్త్రీయంగా నిపుణులు ఏం చెబుతున్నారు? మనమేం చేస్తున్నామన్న దానిపై అత్యధికులకు అవగాహన లేదన్నది చేదునిజం. మాస్కులు వాడే వారంతా తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగింది సరే.. ఇకపై జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

మొదటి వేవ్ కు భిన్నంగా సెకండ్ వేవ్ వేళ రెండు మాస్కుల్ని ధరించాలన్న మాట నిఫుణులుచెబుతున్నారు. అదేమీ కాదంటే.. రెండు మాస్కులు అక్కర్లేదంటే.. పక్కా ఎన్ 95 మాస్కు వినియోగించినా సరిపోతుందని చెబుతున్నారు. వైరస్ బారి నుంచి రక్షించటంలో మాస్కుకు మించింది మరొకటి లేదని చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మాస్కుల్ని ధరించాల్సిందే. ఈ విషయం పాతదే. అయితే.. సర్జికల్ మాస్కుల్ని ఎన్నిసార్లు వాడొచ్చు? అన్నది పెద్ద ప్రశ్న. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం సర్జికల్ మాస్కుల్ని ఒక్కసారి మాత్రమే వాడాలి. అయితే.. ఒకవేళ రెండు మాస్కుల్ని ధరిస్తే మాత్రం ఐదుసార్లు సర్జికల్ మాస్కుల్ని ఉపయోగించే వీలుంది. అయితే.. ఇక్కడో పాయింట్ ఉంది. ప్రతిసారి సర్జికల్ మాస్క్ వాడిన తర్వాత ఏడు రోజులు ఎండలో ఉంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే దాన్ని మరోసారి వాడే వీలుంది.

మరి.. రెండు మాస్కులు వాడే వారు.. దేన్ని ముందు వాడాలి? దేన్ని తర్వాత వాడాలన్న దానిపైనా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. నిపుణుల మాట ప్రకారం మొదట సర్జికల్ మాస్కును ధరించాల్సి ఉంటుంది. దానిపైన బిగుతుగా ఉండే కాటన్ మాస్కుల్ని ధరిస్తే సరిపోతుంది. ఒకవేళ సర్జికల్ మాస్కులు లేకపోతే.. రెండు కాటన్ మాస్కుల్ని ధరిస్తే సరిపోతుందని చెబుతున్నారు. మాస్కుల వినియోగం బాగానే ఉన్నా..నిపుణులు చెప్పిన దాని ప్రకారం పక్కాగా అమలు చేయటం మాత్రం ప్రాక్టికల్ గా కష్టమని చెప్పాలి. అయితే.. ఈ కష్టాన్ని కాస్త భరిస్తే.. కరోనా ముప్పు నుంచి తప్పించుకునే వీలుందన్నది మర్చిపోకూడదు.