Begin typing your search above and press return to search.

మీటింగ్ పెట్టి బాలీవుడ్ మనసును దోచేసిన మోడీ

By:  Tupaki Desk   |   20 Oct 2019 10:26 AM IST
మీటింగ్ పెట్టి బాలీవుడ్ మనసును దోచేసిన మోడీ
X
చీకటిగా ఉన్న గదిలో వెలుగు నింపటానికి సులువైన మార్గం..బల్బ్ వెలిగేందుకు ఏ స్విచ్ వేయాలో తెలిస్తే సరిపోతుంది. ఇలాంటి విషయాల్లో ప్రధాని మోడీకి మించినోడు ఉండరనే చెప్పాలి. ఎవరిని..ఎప్పుడు సీన్లోకి తీసుకురావాలో.. ఎవరిని ఎప్పుడు కలవాలో.. కలిసినప్పుడు వారికేం చెప్పాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికి తెలీదు. కాబట్టే.. దేశంలో ఇప్పటి వరకూ ప్రధానులు వ్యవహరించని పనిని తాజాగా మోడీ షురూ చేశారు.

ఎవరు అవునన్నా.. కాదన్నా దేశ ప్రజల మీద సినిమా రంగం చూపించే శక్తి అపారం. మరి.. అలాంటి బాలీవుడ్ దిగ్గజాల్ని తన వద్దకు పిలిపించుకొని వారికి కొన్నినీత బోధనలు చేసి.. మీ నుంచి నేను కోరేది ఒక్కటే.. గాంధీ మార్గాన్ని.. ఆశయాన్ని దేశ ప్రజలకు మీ మాథ్యమం ద్వారా చెబుతూ ఉండండి. అందుకు తగిన ప్రయత్నం చేయండని కోరితే.. బాలీవుడ్ ప్రముఖులకు కావాల్సిందేముంది.

తమకెంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా.. ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా గుర్తించి.. పిలిచి.. తమతో సమావేశం కావటానికి మించి బాలీవుడ్ ప్రముఖులు మరింకేమీ కోరుకోరు. ఇలాంటి వాటిని ఇట్టే పూర్తి చేయటమే కాదు.. వారి మనసుల్ని దోచేసే విషయంలోనూ మోడీ విజయం సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రధాని మోడీతోసమావేశమైన బాలీవుడ్ ప్రముఖుల్లో అమిర్ ఖాన్.. షారుక్ ఖాన్.. కంగనా రౌనత్.. జాక్విలిన్ ఫెర్నాండెజ్.. రాజ్ కుమార్ హిరానీ.. దర్శకులు ఇంతియాజ్ అలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడంతమంది బాలీవుడ్ ప్రముఖుల్ని ఢిల్లీకి పిలిచి మరీ మీటింగ్ పెట్టిన మోడీ తీరుతో బాలీవుడ్ ప్రముఖులు కనెక్ట్ అయిపోయారు.

తమను ప్రధానమంత్రి గుర్తించటంపై బాలీవుడ్ ప్రముఖులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అందరికి తెలిసిన విషయాల్ని మీరు మళ్లీ మీరు ప్రారంభించారు. నావరకు నాకు ఏమనిపిస్తోందంటే గాంధీ2.0 అవసరమేమోననిపిస్తోందని బాలీవుడ్ బాద్షా షారుక్ అభిప్రాయపడితే.. తనకు తెలిసి.. కళలు.. కళాకారులు.. సినీ పరిశ్రమను పరిగణలోకి తీసుకొన్న తొలి ప్రభుత్వం ఇదేనని ప్రముఖ సినీ నటి కంగానా రౌనత్ వ్యాఖ్యానించారు. ఇదివరకు ఎవరూ సినిమా రంగానికి ఇంత గౌరవం ఇవ్వలేదు.. సినీ పరిశ్రమకు ఉన్న సున్నితమైన శక్తిని గుర్తించలేదు.. గాంధీజీ సిద్ధాంతాల్ని.. ప్రచారం.. ఆయన జీవితం.. విలువల గురించి ప్రధాని మాకు వివరించారని ఆమె పేర్కొన్నారు.

ప్రధాని చెప్పిన విధానం బాగుంది. సరళంగా.. అందంగా ఉంది. మా అందరికి అర్థమైంది.. గాంధీజీ మీదా.. ఆయన విధానాల మీదా సినిమాలు చేయమన్నారంటూ ప్రముఖ దర్శకులు ఇంతియాజ్ అలీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం తర్వాత మీడియాతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఆ వీడియో క్లిప్పులన్ని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల్లో వామపక్ష భావజాలం ఉన్న వారు ఎక్కువగా ఉంటారు. దానికి భిన్నంగా ఒక దళాన్ని తయారు చేసుకోవటమే మోడీ లక్ష్యమని చెప్పాలి. మీరు నాకు అండగా ఉండమని అడిగే కంటే.. నీతి బోధనలు చేయటం ద్వారా మనసుల్ని ఎలా గెలుచుకోవాలో ప్రధాని మోడీకి తెలుసు. అందుకు బాలీవుడ్ ప్రముఖుల్ని పిలిచిన ఆయన.. వామపక్ష భావజాలం ఉన్న వారెవరినీ తన మీటింగ్ కు ఆహ్వానించకపోవటం గమనార్హం.

లెఫ్ట్ వింగ్ కు చెక్ పెట్టేందుకు రైట్ వింగ్ ను తయారు చేస్తే సరిపోతుందన్నట్లుగా మోడీ వ్యూహాత్మకంగా బాలీవుడ్ ప్రముఖుల్ని కలిసి.. వారు ఊహించని రీతిలో మాట్లాడటం ద్వారా వారి మద్దతునే కాదు.. మనసుల్ని దోచేశారని చెప్పాలి.

ఖాన్ల ద్వయం ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేయటం ఈ తరానికి అంతో ఇంతో కొత్తగా అనిపించకుండా ఉంటుందా? వారి మీద ప్రభావం చూపించకుండా ఉంటుందా చెప్పండి? మోడీ తన ఇమేజ్ ను పెంచుకోవటానికి బాలీవుడ్ ను ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకుంటున్నారన్న విమర్శను తాజా పరిణామం నేపథ్యంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.