Begin typing your search above and press return to search.

ఎన్ని డెడ్ లైన్లు పెడతారు ?

By:  Tupaki Desk   |   3 Jan 2022 11:19 AM IST
ఎన్ని డెడ్ లైన్లు పెడతారు ?
X
జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ ఎన్ని డెడ్ లైన్లు పెడుతుందో అర్ధం కావటంలేదు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపైన ఒకసారి డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ ఏమైందో ఎవరికీ తెలీదు. తాజాగా గుంటూరు జిల్లాలో రైతుల కోసం మళ్ళీ డెడ్ లైన్ పెట్టింది. గుంటూరులో పంటలు నష్టపోయిన వరి, మిర్చి రైతులకు సంక్రాంతి పండుగలోపు న్యాయం జరగకపోతే తర్వాత స్వయంగా పవన్ కల్యాణే రంగంలోకి దిగుతారని పొలిటికల్ అడ్వయిజరీ కమిటి (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు.

జగన్ కు పవన్ పేరుచెప్పి నాదెండ్ల వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వానికి స్వయంగా పవన్ వార్నింగ్ ఇస్తేనే జగన్ పట్టించుకోలేదు. అలాంటిది పవన్ పేరుచెప్పి నాదెండ్ల హెచ్చరిస్తే ప్రభుత్వం లెక్కచేస్తుందా ? మిర్చి రైతులకు న్యాయం జరగాలని కోరుకోవటంలో తప్పులేదు. అంతేకానీ రైతుల పేరుచెప్పి ప్రభుత్వాన్ని బెదిరించాలని చూడటం ఏమిటో అర్ధం కావటంలేదు.

వైజాగ్ స్టీల్స్ విషయంలో ప్రభుత్వానికి పవన్ వార్నింగ్ ఇస్తే ఏమైంది ? ఏమవుతుంది తానిచ్చిన వార్నింగును పవనే మరచిపోయారు. అప్పుడు కూడా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళటానికి జగన్ కు వారం రోజుల గడువిచ్చారు. తర్వాత తానేం చేస్తానో తనకే తెలీదన్నట్లు వ్యవహరించారు. చివరకు ఏమైంది ? ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని పవనే మరచిపోయారు. ప్రభుత్వం అసలు ఆ విషయాన్ని పట్టించుకోనేలేదు.

తానిచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి ఈమధ్యనే మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశానని అనిపించుకున్నారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం ఏమిటో పవన్ కే తెలియాలి. ఇపుడు తాజా మిర్చి రైతుల పేరుతో మళ్ళీ ఒక డెడ్ లైన్ పెట్టారు. సంక్రాంతి పడగలోపు వరిని ప్రభుత్వం కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పండగ వెళ్ళిన వారంలో జిల్లా కేంద్రంలో స్వయంగా పవనే దీక్ష చేస్తారట.

అలాగే పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతులు నష్టపోయారట. మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదని నాదెండ్ల ఆరోపించారు. నాలుగున్నర లక్షల ఎకరాల్లో రైతులు మిర్చీని నష్టపోయినట్లు చెప్పారు. ప్రతిరైతు సగటున రు. 70 వేలు నష్టపోయారట. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందట. తమ దీక్షలతో రైతులకు న్యాయం చేయాలనేది పవన్ ఆలోచనట. చూద్దాం చివరకు ఏమవుతుందో.