Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఫలితాలు పూర్తిగా వెలువడేది ఎన్ని రోజులకు?

By:  Tupaki Desk   |   4 Nov 2020 3:00 PM IST
అమెరికా అధ్యక్ష ఫలితాలు పూర్తిగా వెలువడేది ఎన్ని రోజులకు?
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ షురూ అయ్యిందన్న వార్తలు మొదలైన కాసేపటికే.. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారని.. మరికొన్ని రాష్ట్రాల్లో బైడెన్ గెలిచినట్లు వార్తలు రావటం తెలిసిందే. దీంతో.. ఎన్నికల ఫలితాలు ఇవాల్టికి వస్తాయని.. గెలుపు ఎవరిదో తేలిపోతుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పుడు వస్తున్న ఫలితాలన్ని కూడా చిన్న రాష్ట్రాలకు సంబంధించినవే. పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన ఫలితం ఇప్పటికిప్పుడు తేలే అవకాశం లేదంటున్నారు. ఆ మాటకు వస్తే.. నాలుగైదు రోజుల్లో ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడతాయని చెబుతున్నారు. అయితే.. ఒకట్రెండు రాష్ట్రాల్లో అయితే వారం రోజుల పాటు ఓట్ల లెక్కింపు సాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఎందుకిలా? అంటే..గతంలో ఎప్పుడూ లేనంతగా పోస్టల్.. ఈమొయిల్ ఓట్లే కారణమని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కు ముందుగా ఎర్లీ ఓటింగ్ అవకాశాన్ని కల్పించారు. దీంతో నిర్ణీత పోలింగ్ కంటే ముందే దాదాపు పది కోట్ల పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఇన్ని ఓట్లను లెక్కించటం అంటే మాటలు కాదు. ఈ కారణంతోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుందని చెబుతున్నారు.

అంతేకాదు.. పోలింగ్ ముగిసినమూడు రోజుల వరకూ పోస్టల్.. అబ్సెంటీ ఓట్లను కూడా లెక్కించాలని పెన్సిల్వేనియా కోర్టు ఇచ్చిన తీర్పు కూడా తుది ఫలితం వెలువడే విషయంలో జాప్యం జరిగే వీలుందని చెబుతున్నారు. తాజాగా వినిపిస్తున్న అంచనాల ప్రకారం పోలింగ్ ముగిసిన ఏడు రోజుల వరకు అంటే.. ఈ నెల పదో తేదీ వరకు పోస్టల్ - అబ్సెంటీ ఓట్లను అనుమతించాలన్న నిబంధన ఉంది. అంటే.. ఈ నెల పది తర్వాత లేదంటే పదకొండు.. పన్నెండు తారీఖుల్లో కానీ పూర్తిస్థాయిలో ఎవరు గెలిచారన్నది తేలుతుంది.

కాకుంటే.. ఇరువురు అభ్యర్థుల మధ్య స్వల్ప అధిక్యత ఉంటే.. నరాలు తెగే ఉత్కంఠతో పాటు.. పలు విపరిణామాలకు అవకాశం ఉంటుందంటున్నారు. అలాంటిదేమీ లేకుండా.. క్లియర్ గా వన్ సైడ్ మెజార్టీ అన్నట్లుగా ఫలితాల సరళి సాగితే మాత్రం.. విజయం ఎవరిదన్నది లాంఛన ప్రాయమే అవుతుంది. ఇప్పటికే వెలువడిన ఫలితాలు చూస్తే.. ట్రంప్.. బైడెన్ మధ్య పోటీ నువ్వా నేనా? అన్నట్లు ఉండటమే కాదు.. స్వల్ప వ్యత్యాసమే ఉంది. దీంతో.. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న సస్పెన్స్ మరికొన్నిరోజుల వరకు ఆగక తప్పదు.