Begin typing your search above and press return to search.

2018-19 రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాలు ఎన్ని కోట్లంటే..?

By:  Tupaki Desk   |   10 March 2020 5:38 AM GMT
2018-19 రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాలు ఎన్ని కోట్లంటే..?
X
భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫామ్స్ సంస్థ సంచలన విషయాలని బయటపెట్టింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 2599 పార్టీలు రిజిష్టర్ అయి ఉన్నాయి. వాటిలో 8 జాతీయ పార్టీలు, 53 రాష్ట్ర పార్టీలు, మరియు 2538 గుర్తింపులేని పార్టీలు ఉన్నాయి. దేశంలో ఎక్కువగా జాతీయ పార్టీలదే హవా నడుస్తోంది. 2018-19 విరాళాల రూపంలో అన్ని పార్టీలకు కలిపి రూ.2,512 కోట్లు వచ్చినట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అధ్యయనంలో తేలింది.

మాములుగా..గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ. 20,000 లోపు వచ్చే విరాళాలకు రాజకీయ పార్టీలు లెక్క చూపాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ మినహాయింపు ఇచ్చింది. అలాగే రూ.20 వేల పైన ఎవరైతే, పొలిటికల్ పార్టీలకు విరాళాలను ఇస్తారో వారి పేర్లను ఖచ్చితంగా నమోదు చేయాలి. అయితే.. పార్టీలు మాత్రం కోట్లలో విరాళాలు తీసుకుంటూ.. లెక్క చూపడంలేదని ఐటీ శాఖ ఆరోపిస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్‌ ఫండ్‌, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ వ్యవహారం పై అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ సంస్థ జరిపిన విశ్లేషణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2018-19లో అన్ని రాజకీయ పార్టీలకు కలిపి రూ.2,512 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ మొత్తంలో ... 2014 మరియు 2019లో దేశంలోనే పెద్ద పార్టీగా అవతరించి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ 2018-19 సంవత్సరంలో రూ. 1612 కోట్లు విరాళాలుగా సేకరించింది. అంటే మొత్తం వాటాలో బీజేపీ వాటా 64 శాతం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రూ. 728.88 కోట్లు విరాళాలుగా పొందినట్లు ఏడీఆర్ తెలిపింది. పార్టీల మొత్తం విరాళాల శాతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ విరాళాల మొత్తం 29 శాతంగా ఉంది.

ఇక అజ్ఞాత విరాళాల్లో 78 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూరింది. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి చిరుమానాలు తెలియవు. వీటి విలువ రూ.1,960 కోట్లు అంటే ఎక్కువ మంది పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకుండా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేస్తున్నారు. పేర్లు బయటికి తెలిసేలా రూ.20 వేలకు మించిన విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను చాలా తక్కువ మందికి కొనుగోలు చేస్తారు. అయితే తమకు రూ.20వేల విలువకు మించిన బాండ్లేవీ రాలేదని బీఎస్పీ తెలిపింది.