Begin typing your search above and press return to search.

భారత్ కొవిడ్ సర్టిఫికెట్లతో ఎన్ని దేశాలకు వెళ్లొచ్చో తెలుసా?

By:  Tupaki Desk   |   10 Nov 2021 10:00 AM IST
భారత్ కొవిడ్ సర్టిఫికెట్లతో ఎన్ని దేశాలకు వెళ్లొచ్చో తెలుసా?
X
ఏడాది క్రితం కరోనా మహమ్మారి విలయతాండవం గురించి గుర్తు చేసుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. మహమ్మారి ధాటికి ఎంతోమంది బలయ్యారు. అయితే మనదేశంలో రెండు దశలుగా వైరస్ కోరలు చాచి... ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. అయితే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే ఉంది. కారణం వ్యాక్సినేషన్. దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ శరవేగంగా దూసుకుపోతోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి తొలుత చాలామంది భయపడ్డారు. ఎంత అవగాహన కల్పించినా ప్రజలు ముందుకురాలేదు. ఆ తర్వాత కొవిడ్ వల్ల భయం, టీకాపై నమ్మకంతో వ్యాక్సినేషన్ కు అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇక అర్బన్ నుంచి రూరల్ వరకు ప్రతిఒక్కరూ టీకా తీసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. అయితే మనదేశంలో అభివృద్ధి చేసిన ఓ రెండు టీకాలకు ప్రపంచ దేశాల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలో ఈ రెండు టీకాల డోసులే ఇప్పటివరకు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. డబ్లూహెచ్ వో గుర్తింపుతో పాటు ఇతర దేశాల్లోనూ గుర్తింపును సొంతం చేసుకున్నాయి.

ఇండియా ఉత్పత్తి చేసిన రెండు వ్యాక్సిన్లకు ప్రపంచదేశాల నుంచి ఆమోదం లభిస్తోందని కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎనిమిది టీకాలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. అందులో భారత్ కు చెందిన రెండు వ్యాక్సిన్లు ఉన్నాయని పేర్కొన్నారు. డబ్లూహెచ్ వో గుర్తించిన టీకాల్లో దేశానికి చెందిన భారత్ బయోటిక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్, సీరమ్ ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ ఉండడం దేశానికే గర్వకారణం అని కేంద్రమంత్రి కొనియాడారు. పైగా ఈ రెండు వ్యాక్సిన్లను 96 దేశాలు గుర్తించాయని ఈ సందర్భంగా తెలియజేశారు. టీకాను పరస్పరం ఆమోదించుకోవడానికి ఆ 96 దేశాలు అంగీకరించాయని కేంద్రమంత్రి తెలిపారు. అంతేకాకుండా కొవిన్ యాప్ లో ఈ దేశాలకు సంబంధించిన లిస్ట్ ఉందని వివరించారు.

భారత్ అభివృద్ధి చేసిన ఈ రెండు టీకాలకు విదేశాల్లో మంచి స్పందన వస్తోందని కేంద్రఆరోగ్య మంత్రి తెలిపారు. తొలుత కొన్ని దేశాలకు పరిమితమైన ప్రస్తుతం 96 దేశాలు గుర్తించాయని పేర్కొన్నారు. ఇకపోతే మరిన్ని దేశాల్లో మన టీకాలకు గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా మన దేశంలోని ఈ రెండు టీకాలు తీసుకున్న ప్రయాణికులు ఈ వ్యాక్సిన్లు గుర్తించిన దేశాలకు వెళ్తే ఎటువంటి ఆంక్షలు ఉండవని మాండవీయ స్పష్టం చేశారు. భారతీయ ప్రయాణికులకు ఆ దేశాల్లో మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. భారత కొవిడ్ ధ్రువీకరణ పత్రాలతో ఈ 96 దేశాలకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని కేంద్రమంత్రి తెలిపారు. ఇప్పటికే దేశంలో 109 కోట్ల డోసులకు పైగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా టీకాను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వారు గడపగడపకూ వెళ్లి వ్యాక్సిన్లు ఇస్తున్నారని కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తొలుత కొన్ని అపోహల వల్ల మందకొడిగా సాగిన టీకా పంపిణీ కార్యక్రమం ఆ తర్వాత ఊపందుకుంది. ఇప్పుడు వృద్ధులు, యువత తేడా లేకుండా టీకా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే రెండో వేవ్ చూపిన ప్రభావంతోనే జనాల్లో మార్పు వచ్చిందని నిపుణులు అంటున్నారు. టీకాలతో మహమ్మారి ముప్పు నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. కాగా దేశంలో తయారైన రెండు టీకాలకు డబ్లూహెచ్ వో గుర్తింపు రావడం భారతీయులందరికీ గర్వకారణమే.