Begin typing your search above and press return to search.

లోకేష్ తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నాడా?

By:  Tupaki Desk   |   9 Jun 2020 10:42 AM GMT
లోకేష్ తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నాడా?
X
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారిందట టీడీపీ కథ.. అధికారంలో ఉన్నప్పుడు అధికార అహంతో ఆవేశానికి పోయిన చినబాబు వైఖరికి ఇప్పుడు పార్టీ కేడర్ అంతా కుదేలైన పరిస్థితి పార్టీలో కనిపిస్తోందట.. చంద్రబాబు స్వయంగా ఆరాతీస్తే లోకేష్ బాబు చేష్టలు కళ్లకు కట్టాయట.. దీంతో చంద్రబాబు బతిమిలాడుతూ టీడీపీ నేతలను కాపాడుకుంటున్న దైన్యం పచ్చపార్టీలో ఉందట..

2014.. ఉమ్మడి ఏపీ విడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అది ఘనమైన మెజార్టీతోనే.. ఎవరిపైనా ఆధారపడని విధంగా టీడీపీకి జనాలు పట్టం కట్టారు. అదే తెలంగాణలో ట్రెయిన్ రివర్స్. టీఆర్ఎస్ కేవలం బోటాబోటా మెజార్టీతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో కేసీఆర్ గద్దెనెక్కగానే ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను నయానో భయానో లాగేశాడు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా చేర్చుకున్నాడు. వాళ్లకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు.

ఈ క్రమంలోనే తన భావి రాజకీయ వారసుడు కేటీఆర్ ను కూడా తొలి తెలంగాణ ప్రభుత్వంలో పెద్దపీట వేసి అతడికి ఓనమాలు నేర్పాడు. ఏకంగా ఐటీ, పంచాయితీరాజ్ శాఖ ఇచ్చి మంత్రిని చేశారు. అయితే కేసీఆర్ తన కుమారుడికి పెద్దపీట వేయడం చూసి.. ఏపీలో కూడా చంద్రబాబు తన కుమారుడు లోకేష్ బాబును రాజకీయ అరంగేట్రం చేయించాడు. ఏపీలో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవక పోయినా సరే ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు తన కొడుకికి కేటీఆర్ కు ఇచ్చిన పొర్ట్ ఫొలియోలనే ఏపీలో ఇవ్వడం విశేషం. అయితే కేటీఆర్ ఐటీ, పంచాయితీరాజ్ శాఖలను సమర్థవంతంగా చేస్తే.. లోకేష్ అంత యాక్టివ్ గా లేకుండా పదవిని మురిసిపోతూ అంతా బాగుంది అనే భ్రమలో బతుకుతూ లోకేష్ పార్టీ కేడర్ ను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అవమానిస్తూ కాలం గడిపాడనే అపప్రద ఉంది. లోకేష్ బాబు పార్టీలో, ప్రభుత్వంలో వేలు పెట్టడం వల్లే అధికారం కోల్పోయి జగన్ కు సీఎం పదవి అధించాడు అని టీడీపీ వర్గాలు ఆడిపోసుకుంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో టీడీపీ ఇన్ చార్జిలు మెల్లిగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి జంప్ అవుతూ ఉన్నారు. చంద్రబాబుకు విషయం అర్థం కాక వారిందరికీ వాట్సాప్ లో కాల్ చేసి మాట్లాడుతున్నారట.. వారు చెప్పిన కారణాలు విని చంద్రబాబు షాక్ అవుతున్నాడట.. లోకేష్ మమ్మల్ని చాలా అవమానించాడని.. మాకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా నియోజకవర్గంలో సరిగా విలువ ఇవ్వకుండా చేశాడు అని రకరకాలుగా లోకేష్ పై బాబుకు ఫిర్యాదు చేశారట.. దానికి చంద్రబాబు లోకేష్ ఇప్పుడు అలా చేసిందనుకు ఫీల్ అవుతున్నాడని.. తప్పు చేశాను అని బాధపడుతున్నాడని.. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా తాను చూసుకుంటానని నేతలకు చంద్రబాబు అభయమిచ్చాడట.. ఇలా చాలా మంది టీడీపీ ఇన్ చార్జులు, టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వాట్సాప్ కాల్ చేస్తూ లోకేష్ కథలు.. కథలు కథలుగా వింటున్నాడట... కావాలి అంటే లోకేష్ తో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పిస్తా అని కూడా చంద్రబాబు వారికి హామీ ఇస్తున్నాడట.. ఇలా లోకేష్ వల్ల చంద్రబాబుకు ఎంతో ఇబ్బంది వచ్చిందని టీడీపీ వర్గాలే అంటున్నాయని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.