Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ హీరోయిన్ల‌ను ఎందుకు వ‌దిలేశారంటే

By:  Tupaki Desk   |   7 April 2018 1:34 PM GMT
స‌ల్మాన్ హీరోయిన్ల‌ను ఎందుకు వ‌దిలేశారంటే
X
కృష్ణ జింకల వేట కేసులో అయిదేళ్లు జైలు శిక్ష పడ్డ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు శిక్ష ప‌డటం..బెయిల్ మంజూర‌వ‌డం తెలిసిన సంగ‌తే. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని జోధ్‌పూర్ జైలుకు తీసుకువెళ్లారు. ఇవాళ బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిపిన తర్వాత సల్మాన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరీ చేశారు. 20 ఏళ్ల క్రితం ఓ ఫిల్మ్ షూటింగ్ కోసం జోధ్‌పూర్‌కు వెళ్లిన సల్మాన్ అక్కడ మిగతా నటులతో కలిసి కృష్ణ జింకల వేట చేశాడు. ఆ కేసులో మిగతా స్టార్స్‌కు ఊరట లభించినా.. సల్మాన్‌ను మాత్రం దోషిగా తేల్చారు. అయితే వారికి ఎందుకు శిక్ష ప‌డలేద‌నేదే ఆస‌క్తిక‌రం.

కృష్ణజింకల వేట కేసులో కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ - నీలమ్ - సోనాలీ బింద్రే - టబు కూడా నిందితులుగా కేసును ఎదుర్కొన్నారు. కోర్టు విచారణలకు హాజరై తమ వాదనలు వినిపించారు. కానీ వారికి శిక్ష పడలేదు. సల్మాన్ తో ఆ రోజు ఉన్న మిగతా వారికి శిక్ష పడకపోవడానికి కారణం ప్రత్యక్ష సాక్షి గుర్తు పట్టకపోవడమే అని అంటున్నారు. సల్మాన్ తో పాటు ఆరోజు జీపు వెనుక సీట్లలో టబు, సోనాలీ కూడా ఉన్నారని, వారే సల్మాన్ ను తుపాకీతో కాల్చమని ప్రోత్సహించారని ప్రాసిక్యూషన్ ఇదివరకే ఆరోపించింది. కానీ వారికి శిక్ష పడకపోవడానికి కారణం ఆనాటి ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సల్మాన్‌తో పాటు ఆ రోజు జీపులో ఉన్నది వారేనా? అన్నది ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్ కచ్చితంగా చెప్పలేకపోవడం వ‌ల్ల‌నేన‌ని మీడియా వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలీ బింద్రేలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. వారికి కూడా శిక్ష పడాల్సిందేనని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది.!