Begin typing your search above and press return to search.

హెలికాఫ్టర్ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు?

By:  Tupaki Desk   |   10 Dec 2021 6:31 AM GMT
హెలికాఫ్టర్ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు?
X
సాంకేతికంగా వంక పెట్టలేని ఎంఐ-17 హెలికాఫ్టర్ ఎలా ప్రమాదానికి గురై ఉండొచ్చు? దీనికి కారణం ఏమిటి? వాతావరణం సరిగా లేదనుకుంటే.. క్లియరెన్సు ఎలా ఇచ్చారు? సీడీఎస్ లాంటి అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి భద్రతకు ఇచ్చే ప్రోటోకాల్ చాలా కఠినంగా.. పక్కాగా ఉంటుంది. ఇక.. ఆయన ప్రయాణించే హెలికాఫ్టర్ అంటే.. సాంకేతికంగా పక్కాగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే ప్రయాణానికి అనుమతులు ఇస్తుంటారు.

ప్రోసీజర్ ఇంత పక్కాగా ఉన్నప్పుడు.. ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి పలు విశ్లేషణలు వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ కమాండర్ టీజే రెడ్డి.. రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ ఎన్ఎన్ రెడ్డిలు ప్రమాదాన్ని తమకున్న అవగాహనతో విశ్లేషించారు. వారు చేసిన విశ్లేషణల్ని వారి మాటల్లోనే చెబితే..

ఎంఐ 17 హెలికాప్టర్ గంట ప్రయాణానికి 800 లీటర్ల ఇంధనం అవసరం అవుతుందని.. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో కనీసం 1200 లీటర్ల ఇంధనం ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎత్తు నుంచి కిందకు పడిన వెంటనే పెద్ద ఎత్తున ఉన్న ఇంధనం కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వీఐపీలు ప్రయాణించే విమానాలు.. హెలికాఫ్టర్లను అత్యంత అనుభవం ఉన్న పైలెట్లే నడుపుతుంటారు. టేకాఫ్ కావటానికి మందే పలు రకాల పరీక్షలు చేస్తారు. మేఘాలు స్పష్టంగా కనిపించినా.. పొగమంచు ఆ స్థాయిలో కనిపించదు. రావత్ ప్రయాణించిన మార్గంలో అడవులు.. కొండలు ఉన్నాయి. చలికాలంలో కొండలపై భాగంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండొచ్చు.. అనుకోకుండా పెరిగిపోవచ్చు. గమ్యానికి మరో 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతోనే హెలికాఫ్టర్ ను కిందకు దించి ఉంటారు.

ఆ సమయంలో పొగమంచు కారణంగా కింద ఏముందో కనిపించే అవకాశం తక్కువ. అనుభవం ఉన్న పైలెట్ కావటంతో ధైర్యంగా కిందకు దించి ఉండొచ్చు. ఆ సమయంలోనే సాంకేతికంగా ఏదైనా సాంకేతికత సమస్య వచ్చి హెలికాఫ్టర్ సడన్ గా డ్రాప్ అయి ఉంటుంది. ఒకేసారి 100 నుంచి 150 అడుగులు కిందకు పడిపోయి ఉండటంతో.. హెలికాఫ్టర్ లోని ఇంధనం నుంచి మంటలు అంటుకొని ఉండొచ్చు.

సాధారణంగా వాతావరణం బాగాలేనప్పుడు పైలెట్లు సురక్షితమైన ఎత్తును పాటిస్తూ ఉంటారు. గమ్యానికి చేరిన తర్వాత దిగాల్సిన చోట నాలుగైదు రౌండ్లు వేసి.. ఎత్తు తగ్గించుకొని ల్యాండింగ్ చేస్తారు. రావత్ ప్రయాణించిన హెలికాఫ్టర్ లో ఇలా ఎందుకు జరగలేదన్నది తేలాల్సి ఉంది. బ్లాక్ బాక్స్ లో సమాచారం.. ప్రమాదానికి కారణాన్ని విశ్లేషించే వీలుంది. దీని సమాచారం తేలాలంటే మరో పది.. పదిహేను రోజులు తీసుకుంటుంది.