Begin typing your search above and press return to search.

అదేంది సారూ.. ప్రగతిభవన్ బకాయిలు ఉండటమా?

By:  Tupaki Desk   |   3 July 2021 5:30 AM GMT
అదేంది సారూ.. ప్రగతిభవన్ బకాయిలు ఉండటమా?
X
టైంకి ఆస్తిపన్నుకట్టండి.. లేకుంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాద్యులు కావాల్సి వస్తుందంటూ తరచూ ప్రచారంతో హోరెత్తించేస్తుంటారు అధికారులు. ఆస్తిపన్నును సామాన్యల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రదర్శించే ఉత్సాహం.. పెద్దోళ్ల విషయాల్ని అస్సలు పట్టించుకోరా? అన్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించకపోతే నోటీసులు ఇవ్వటం.. చర్యలు తెర తీయటం మామూలే.

ఆస్తిపన్ను వసూలు విషయంలో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎంత పక్కాగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతిభవన్ కట్టి.. ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు కట్టిన ఆస్తిపన్ను ఎంతన్న విషయాన్ని లెక్క చూసినప్పుడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. ప్రగతిభవన్ ఇప్పటివరకు పైసా ఆస్తిపన్నును జీహెచ్ఎంసీకి కట్టింది లేదు.

నిజానికి ప్రగతిభవన్ ను నిర్మించిన నాటి నుంచి ఆస్తిపన్ను మదింపు చేయలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అందులోకి షిఫ్టు అయిన తర్వాతే మదింపు చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి భవన్ కు సంబంధించిన ఆస్తిపన్ను మదింపు కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు. అధికారిక రికార్డుల ప్రకారం ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్ లొకాలిటీలో ఉన్న చీఫ్ మినిస్టర్ క్యాంపస్ పేరుతో జీహెచ్ఎంసీ రికార్డుల్లో ఉంది.

గడిచిన నాలుగేళ్లుగా పన్ను బకాయి పెండింగ్ లో ఉంది. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా కట్టింది లేదు. ఇప్పటివరకు 3,83,588 మొత్తాన్ని ఆస్తిపన్నురూపంలో బకాయి ఉంది. గడిచిన మూడేళ్లకు వాస్తవ ఆస్తిపన్ను రూ.11.50లక్షలు కాగా.. వడ్డీ రూ.1.68 లక్షలు. మొత్తం రూ.13.19 లక్షల బకాయి ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుత సంవత్సరంలోని అర్థ భాగానికి పన్నుగా రూ.1.91 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తం వడ్డీతో కలిపి రూ.17.06లక్షలు బకాయి ఉన్నట్లుగా తేలింది. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే అధికారులు ప్రగతిభవన్ కు విధించిన ఆస్తిపన్ను వసూలు విషయాన్ని ఎందుకు పట్టించుకోనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.