Begin typing your search above and press return to search.

కేసీఆర్ సార్ ...ఓనర్ మమ్మల్ని కిరాయి అడుగుతున్నారే !

By:  Tupaki Desk   |   23 April 2020 12:00 PM IST
కేసీఆర్ సార్ ...ఓనర్ మమ్మల్ని కిరాయి అడుగుతున్నారే !
X
కరోనా లాక్ డౌన్ వల్ల అనేక మంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ , కరోనా మహమ్మారిని అరికట్టడానికి మరో మార్గం లేకపోవడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ..కరోనా సంక్షోభం కారణంగా తెలంగాణలో ఇంటి అద్దెలు అడగవద్దని ఇంటి ఓనర్లను ఆదేశించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల ఇంటి అద్దెలు ఇవ్వాలని ఎవరినీ అడగవద్దని స్పష్టం చేశారు. ప్రజల వద్ద ఆదాయం లేదు కాబట్టి ఎవరూ వసూలు చేయవద్దని, ఇది విజ్ఞప్తి కాదని, ప్రత్యేక చట్టం ప్రకారం ఆదేశంగా పరిగణించాలని అన్నారు. ఆ తరువాత వాయిదాల పద్దతిలో అద్దెను తీసుకోండి అని తెలిపారు.

ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుండి డయల్ 100 కి ఈ కిరాయి ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయట. సార్‌! మా ఇంటి ఓనరు కిరాయి కట్టమని అడుగుతున్నడు. అద్దె చెల్లించాలని రోజూ ఒకటే ఒత్తిడి అంటూ డయల్‌-100కు ప్రతి అర గంటకు ఒకరు ఫోన్‌చేసి ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరైనా యజమానులు కిరాయి అడిగితె డయల్ 100 కి కాల్ చేయాలనీ సీఎం చెప్పడంతో డయల్‌-100కు సోమవారం 57 మంది ఫోన్‌ చేస్తే, మంగళవారం 54 మంది కిరాయిదారులు ఫోన్‌ చేసి, యజమానులు అద్దె అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు.

దీన్ని బట్టి చూస్తే .. ప్రతీ అరగంటకు ఒక ఫోన్‌ ఇంటి కిరాయికి సంబంధించినదే. స్థానిక పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు ఆ యజమానుల వద్దకు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను వారికీ వివరిస్తున్నారు. అలాగే తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుమిగూడి కనిపించినా డయల్‌-100కు ఫోన్‌ చేసి సమాచారం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా కాల్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. లాక్‌డౌన్‌కు సంబంధించి డయల్‌-100కు సోమవారం 1852 ఫిర్యాదులు వస్తే, అందులో జనం గుమిగూడి ఉన్నారని 809, రవాణా సదుపాయం కోసం 144, ఆహారం లేదని 270, మిగతావి ఇతరత్రా అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్టు తెలిపారు. అలాగే , మంగళవారం 1799 ఫోన్లు వస్తే.. అందులో జనం గుమిగూడి ఉన్నారని 903, రవాణా సదుపాయం కోసం 172, ఆహారం లేదని 171, మిగతావి ఇతరత్రా ఫిర్యాదులకు సంబంధించినవి ఉన్నాయి.