Begin typing your search above and press return to search.

మేక‌పాటి.. ప‌ద‌వులు ఎవ‌రికి? వైసీపీలో గ‌రంగ‌రం టాపిక్‌!

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:00 AM IST
మేక‌పాటి.. ప‌ద‌వులు ఎవ‌రికి?  వైసీపీలో గ‌రంగ‌రం టాపిక్‌!
X
వైసీపీలో ఒక విష‌యంపై వాడివేడిగా చ‌ర్చ సాగుతోంది. హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన‌.. మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి.. ఏకంగా ఐదు శాఖ‌లు నిర్వ‌హించారు. ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, ఐటీ, స‌చివాల‌య శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. దీంతో ఈ శాఖ‌ల్లోని కీల‌క‌మైన ప‌రిశ్ర‌మ‌లు, ఐటీల‌ను ఎవ‌రికి కేటాయిస్తారు? అనే చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి.. ఈ శాఖ‌లు ప్ర‌భుత్వానికి ఆదాయం తెచ్చేవాటిలో రెండో ప్లేస్‌లో ఉన్నాయి.

దీంతో వీటిని నిర్వ‌హించే వారు కూడా అంతే స‌మ‌ర్ధులై ఉండాలి. పైగా వ్యాపార వాణిజ్యాల్లో ఉత్త‌మ ఆలోచ‌న‌లు, భాష‌ల ప‌రంగా ప‌ట్టు కూడా సాధించాలి.

మ‌రి ఈ ల‌క్ష‌ణాలు ఉన్న వారు ఎవ‌రు? ఎవ‌రికి సీఎం జ‌గ‌న్ ఈ రెండు శాఖ‌ల‌ను అప్ప‌గిస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం.. న‌లుగురి పేర్లు వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స‌హా ప్ర‌స్తుతం ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర నాథ్‌రెడ్డిల‌కే.. ఈ శాఖ‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

నిజానికి పారిశ్రామికంగా.. రోజాకు పెద్ద‌గా అనుభ‌వం లేదు. అందుకే.. ఆమెను ఏపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి నుంచి కూడా త‌ప్పించారు. సో.. పేరు ఆమెది వినిపిస్తున్నా.. ప‌ద‌వి ద‌క్క‌డ‌మే క‌ష్టం. అలాంట‌ప్పుడు.. కీల‌క‌మైన శాఖ ను అప్ప‌గించే స‌మ‌స్యే లేదు.

పైగా.. రోజాకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అంత సులభంగా జరగదు. చిత్తూరు జిల్లాలో మరో బలమైన నేతకు మంత్రి పదవి ఇవ్వడానికి అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగీకరించే ప్ర‌శ్నేలేదు. ఇక‌, కేతిరెడ్డికి ఐటీలో ప‌ట్టుంది క‌నుక‌, ఆయ‌న‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉంది.

అయితే.. అనంత‌పురం నుంచి ఆయ‌న‌కుమంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుందా? అనేది ప్ర‌శ్న‌. మరో వైపు శాఖల కేటాయింపులో ఇంకోవాదనా వినిపిస్తోంది. కీలకమైన పరిశ్రమల శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కొచ్చనేదీ వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన పేరు కూడా పరిశ్రమల శాఖ కోసం పరిశీలనలో ఉంది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. అస‌లు గౌతం రెడ్డి నిర్వ‌హించిన శాఖ‌ల‌ను ఆయ‌న స‌తీమ‌ణికే ఇచ్చే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం గౌతంరెడ్డి కుటుంబం ఆధ్వ‌ర్యంలోని అన్ని కంపెనీల‌కు.. ఆయ‌న స‌తీమ‌ణి శ్రీకీర్తి డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. గౌతంరెడ్డి మంత్రి కాగానే.. ఆ బాధ‌త్య‌లు ఆ మె తీసుకున్నారు. సో.. ఆమెకే ఈ ప‌ద‌వులు ఇవ్వ‌డం ద్వారా.. అటు సెంటిమెంటు ప‌రంగా కూడా కుటుంబాన్ని ఆదుకున్న‌ట్టు ఉంటుంద‌ని.. వైసీపీలో కీల‌క నేత‌లు అంటున్నారు.