Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   26 Jun 2021 2:51 AM GMT
హాట్ టాపిక్: ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
X
తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే పక్కకు తోసేసి తెలంగాణ రాష్ట్రసమితికి ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనే తెలంగాణ తొలి సీఎం అయ్యారు. అయితే అప్పటి నుంచి కాంగ్రెస్ పైనే పోరాడుతూ రెండు సార్లు ఆ పార్టీని ఓడించి గద్దెనెక్కారు. ఇప్పటికీ కాంగ్రెస్ నే తన ప్రథమ శత్రువుగాకేసీఆర్ భావిస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ పై ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా ఈరోజు సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం విశేషం. అయితే మరియమ్మ లాకప్ డెత్ నేపథ్యంలోనే సీఎంను కలిశారని.. అంతకుమించి వేరే వ్యవహారాలు, రాజకీయాలు లేవని తెలిసింది.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తాజాగా పోలీస్ స్టేషన్ లో మరియమ్మ అనే మహిళ లాక్ డెత్ సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే మధిర కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు సీఎంను ప్రగతి భవన్ లో కలిశారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను అపాయింట్ మెంట్ కోరామని.. ఆయన వెంటనే ఇచ్చారని కాంగ్రెస్ నేతలు కోరారు.

నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసి మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

దీనిపైవెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. ‘దళితులపై దాడులు సహించనని.. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి నిజనిర్ధారణ చేసి చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని.. అవసరమైతే వారిని ఉద్యోగంలోంచి తొలగించాలని సీఎం కేసీఆర్ డీజీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. చింకానికి వెళ్లి బాధితులను పరామర్శించాలని డీజీపీని సీఎం ఆదేశించారు.

ఇక మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతోపాటు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున అందించాలని ఆదేశించారు. 28న ఎమ్మెల్యే భట్టి, మంత్రి పువ్వాడ అజయ్ సహా ఎంపీ నామా, కలెక్టర్, ఎస్పీ బాధిత కుటుంబాలను పరామర్శించి రావాలని సీఎం సూచించారు.