Begin typing your search above and press return to search.

ఇరాన్ దెబ్బకు ఉలిక్కిపడిన అమెరికా?

By:  Tupaki Desk   |   10 Jun 2022 5:03 AM GMT
ఇరాన్ దెబ్బకు ఉలిక్కిపడిన అమెరికా?
X
అణుబాంబు తయారీకి ఇరాన్ రెడీ అవుతోందా ? ఇపుడిదే అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేట్టు చేస్తోంది. ప్రధానంగా అగ్రరాజ్యంగా ప్రచారంలో ఉన్న అమెరికా మరింతగా ఉలిక్కిపడుతోంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఇరాన్ కు అమెరికాకు మధ్య బద్ధ విరోధమున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చైనా, ఉత్తరకొరియా లాంటి దేశాల సైనిక సామర్ధ్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న అమెరికా ఇపుడు ఇరాన్ కారణంగా కూడా సమస్యలు ఎదుర్కోబోతోందా అనే అనుమానాలు పెరిగిపోతోంది.

అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియంను ఇరాన్ ఉత్పత్తి చేస్తున్నది. యురేనియం శుద్ధి చేసే కర్మగారాలు ఇరాన్లో 67 ఉన్నాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణ కోసం ఇరాన్ అన్నీ కర్మాగారాల్లోను సీసీ కెమెరాలున్నాయి. అయితే తాజాగా ఇరాన్ 27 కర్మాగారాల్లోని కెమెరాలను ఇరాన్ తొలగించింది. అది కూడా అణుశక్తి సంస్ధకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కెమెరాలు తొలగించి తర్వాత మాత్రమే సమాచారం అందించింది.

27 కెమెరాలను తొలగించిన విషయం వెంటనే అణుశక్తి సంస్ధకు తెలిసిపోయింది. ఇదే సమయంలో ఇరాన్ నుండి కూడా సమాచారం అందటంతోనే ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

అణ్వస్త్రాలను తయారుచేసుకునే ఆలోచనతోనే ఇరాన్ కొన్ని కర్మాగారాల్లో కెమెరాలను తొలగించినట్లు అనుమానాలు బలపడిపోతున్నాయి. దాంతో అణుశక్తి సంస్ధ ఇరాన్ చర్యల విషయంలో తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే ఈ అభ్యంతరాలను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోలేదు.

మొదటి తరం సెంట్రిఫ్యూజ్ కన్నా 10 రెట్ల ఎక్కువ వేగంతో యురేనియంను శుద్దిచేసే సామర్థ్యం ఉన్న ఐఆర్-6 సెంట్రిఫ్యూజ్ లను నటాంజ్ లో ఏర్పాటు చేయబోతునట్లు గతంలోనే ఇరాన్ ప్రకటించింది. అణ్వాయుధాల తయారీలో 90 శాతం శుద్ధిచేసిన యురేనియం అవసరం. అయితే యురేనియంను శుద్ధి చేయడం అంత తేలికకాదు.

ఇప్పటికి 60 శాతం యురేనియంను శుద్దిచేసే సామర్ధ్యం మాత్రమే ఇరాన్ కుంది. తన సామర్ధ్యాన్ని పెంచుకోవటంలో భాగంగానే సెంట్రిఫ్యూజ్ లను ఇరాన్ రెడీచేసుకుంటోంది. ఇక్కడే అంతర్జాతీయ సమాజానికి ఇరాన్ విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలే నిజమైతే అమెరికాకు ఇరాన్ పక్కలో బల్లెంలాగ తయారవటం ఖాయంగానే అనిపిస్తోంది.