Begin typing your search above and press return to search.

ఓయూలో హాస్టల్​, మెస్​ బంద్​.. తిరగబడ్డ విద్యార్థులు.. ఉద్రిక్తత..!

By:  Tupaki Desk   |   25 March 2021 5:37 AM GMT
ఓయూలో హాస్టల్​, మెస్​ బంద్​.. తిరగబడ్డ విద్యార్థులు.. ఉద్రిక్తత..!
X
కరోనా ఉధ్రుతమైన నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక చర్యలు తీసుకున్నది. ఇప్పటికే స్కూళ్లను బంద్​ చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. యూనివర్సిటీలకు సూచించింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓయూ హాస్టల్​, మెస్​ బంద్​ చేస్తున్నట్టు ప్రకటించారు. 24 గంటల్లో అంటే గురువారం మధ్యాహ్నం లోపు విద్యార్థులంతా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. కరోనా పేరుతో హాస్టళ్లను మూసివేయడం సరికాదని వాళ్లు వాదిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎన్​సీసీ గేట్​ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో తీవ్రంగా ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.

అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాఠశాలలు తెరవడమే దీనికి ప్రధాన కారణమన్న వార్త వినిపిస్తుంది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్​ అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని స్కూళ్లను మూసివేస్తున్నట్టు నిన్న అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే యూనివర్సిటీల్లోని హాస్టళ్లను , మెస్​లను మూసివేయడం పట్ల ఆందోళన నెలకొన్నది. సీఎం కేసీఆర్​.. పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన లభిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతండటం వల్లే సీఎం కేసీఆర్​ ఈ నిర్ణయం తీసుకున్నారని టీఆర్​ఎస్​వీ విద్యార్థి విభాగం నేతలు అంటున్నారు.