Begin typing your search above and press return to search.

నీళ్లు లేక ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్లు ఆపారు

By:  Tupaki Desk   |   9 April 2016 1:27 PM GMT
నీళ్లు లేక ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్లు ఆపారు
X
నీటిని పొదుపుగా వాడాల‌న్న మాట ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తోంది. నీటిని ఎంత జాగ్ర‌త్త‌గా వినియోగించాలో చెబుతూ చాలానే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ నీటి వృధా ఎక్కువ‌గానే ఉంటోంది. క‌డెవెడు నీటి కోసం ఎంత క‌ట‌క‌ట‌లాడుతున్నార‌న్న విష‌యాన్ని ఒక్క‌సారి చూస్తే విస్మ‌యం చెంద‌క మాన‌దు. తాజాగా మ‌హారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో నీటి స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉందో తెలిస్తే గుండె త‌రుక్కుపోక మాన‌దు.

నీటి స‌మ‌స్య మ‌హారాష్ట్ర‌లోని కొన్ని ప్రాంతాల్ని తీవ్రంగా వేధిస్తోంది. ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో చెప్పే ఉదంతం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌డిచిన కొన్నేళ్ల‌తో పోలిస్తే.. ఈ ఏడాది వ‌ర్షాభావంతో మ‌హారాష్ట్రలో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌ని చెప్పాలి. నీళ్లు లేవ‌న్న కార‌ణంగా ఆసుప‌త్రుల్లో చే్యాల్సిన ఆప‌రేష‌న్ల‌ను వాయిదా వేయ‌టం చూసిన‌ప్పుడు నీటి కొర‌త ఎంత ఎక్కువ‌గా ఉందో ఇట్టే తెలుస్తుంది.

ఆప‌రేష‌న్లు చేసే ముందు వైద్యులు త‌మ చేతుల్ని శుభ్రంగా క‌డుక్కుంటారు. అయితే.. మ‌హారాష్ట్రలోని లాతూరు ప్రాంతంలో నీటి కొరత ఎక్కువ‌గా ఉండ‌టంతో.. వైద్యులు ఆప‌రేష‌న్ల‌ను వాయిదా వేస్తున్నారు. నీటి ట్యాంక‌ర్లు రెండు.. మూడు రోజుల‌కోసారి రావ‌టంతో తాము వైద్య సేవ‌ల్ని అందించ‌లేక‌పోతున్న‌ట్లు వైద్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఆప‌రేష‌న్లు ఆపేయ‌టం ఇదే తొలిసారి కాద‌ని మార్చిలో కూడా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంద‌ని చెబుతున్నారు. లాతూర్‌ లో నీళ్ల స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు రాజ‌స్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి రైళ్ల‌లో నీళ్ల‌ను తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలాంటి దయ‌నీయ ప‌రిస్థితులు మ‌న చుట్టూ నెల‌కొన్న వేళ‌.. నీటిని ఎంత పొదుపుగా వినియోగించుకోవాలో క‌దూ..?