Begin typing your search above and press return to search.

యువతులతో వలపు వల.. హనీట్రాప్‌లో నేవీ ఉద్యోగులు.. సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   30 Jan 2020 6:05 PM GMT
యువతులతో వలపు వల.. హనీట్రాప్‌లో నేవీ ఉద్యోగులు.. సంచలన నిజాలు
X
హనీట్రాప్ ఎపిసోడ్‌లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. భారత దేశాన్ని డైరెక్ట్‌గా ఎదురుకునే దమ్ము, ధైర్యం లేక అడ్డదారులు తొక్కుతున్నాయి పాక్ శిబిరాలు. యువతులతో వలపు వల విసిరడమే గాక, భారీగా ముడుపులు ముట్టజెబుతూ నేవీ ఉద్యోగులను తమ ఉచ్చులో వేసుకుంటోంది పొరుగుదేశం. మనదేశ రహస్యాలను తెలుసుకునేందుకు ఇలా పెద్ద స్కెచ్ వేసింది పాక్. కానీ మన భద్రతా బలగాలు ఆదిలోనే పాక్ కుట్రలకు చెక్ పెట్టేశాయి.

నేవీలో కొత్తగా చేరిన యువకులపై ఫోకస్ పెట్టిన పాక్.. వారికి వలపు వల వేస్తూ డబ్బు ఆశ చూపించి ఎర వేస్తున్నట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎప్పటికప్పుడు నేవీ కదలికలకు సంబంధించిన సమాచారం తమకు అందేలా నేవీ ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలడం ఒక్కసారిగా షాకిచ్చింది. ఒప్పుకున్న ముడుపులు ముట్టజెప్పేందుకు గాను.. నేవీ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఉపయోగించారని, ఆ ఖాతాలకు పెద్దఎత్తున నిధులు జమయ్యేవని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది.

ఇందులో ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్‌ సయ్యద్‌, షేక్‌ సహిస్థాల హస్తం ఉందని తెలిసింది. పాకిస్థాన్‌ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నౌకాదళ ఉద్యోగుల ఖాతాల్లో వీరు సొమ్ములు జమచేసేవారని గుర్తించింది ఎన్‌ఐఏ. ఈ కేసులో ఇప్పటివరకూ 13 మంది నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేశారు.

ఆ 13 మందిలో ఇద్దరు హవాలా ఆపరేటర్లు, 11 మంది నౌకాదళ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లంతా కూడా పాతికేళ్లలోపు యువకులే కావడం విశేషం. ఎన్‌ఐఏ అదుపులో ఏ1 అదాన్..ఇతను పాకిస్తాన్ నివాసి. ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్నారు. ఏ2- ఇంతెజర్ సయ్యద్‌, ఏ6- స్వామికుమార్, ఏ7-అశోక్ కుమార్, ఏ8-సంజయ్‌కుమార్ డెగె, ఏ9-అశోక్ కుమార్, ఏ10-సంతోష్‌ సంజయ్ ఇకడే, ఏ11-సంజయ్‌ కుమార్, ఏ12- ఐకాస్ కుమార్, ఏ13- సోనుకుమార్, ఏ15-షేక్ సహిష్థ, ఏ16- అపర్ష్‌ సింగ్‌ రజ్వత్‌, ఏ17- కల్పవల్లి కొండబాబు, ఏ18- అవినాష్ సోనల్‌లు ఉన్నారు.

ఉగ్రదాడుల సన్నాహాక కార్యక్రమాల్లో భాగస్వాములమవుతున్నామని ఈ నిందితులందరికీ తెలుసని నిగ్గు తేల్చింది ఎన్‌ఐఏ. ఈ నిందితులంతా ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఈ-మెయిల్‌ అకౌంట్స్ ఉపయోగించి పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధులతో సంభాషణలు జరిపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే యుద్ధనౌకలతో పాటు సబ్‌మెరైన్ల కదలికల సమాచారాన్ని, అలాగే నౌకాదళ కార్యకలాపాల వివరాలను పాక్‌ నిఘా విభాగానికి అందించేవారని ఎన్‌ఐఏ విచారణలో తేలింది.