Begin typing your search above and press return to search.

ఫేక్ న్యూస్ పై హోం శాఖ వార్నింగ్!

By:  Tupaki Desk   |   5 July 2018 1:26 PM GMT
ఫేక్ న్యూస్ పై హోం శాఖ వార్నింగ్!
X
ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వాడకం పెరిగిన నేప‌థ్యంలో వాట్సాప్ - ఫేస్ బుక్ ల‌లో ఫేక్ న్యూస్ లు స్వైర విహారం చేస్తున్నాయి. వేలాదిమందికి విలువైన‌ స‌మాచారాన్ని వేగంగా చేర‌వేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తోన్న వాట్సాప్ ను కొంద‌రు దుర్వినియోగ‌ప‌రుస్తున్నారు. క‌నీస స్థాయిలో నిజానిజాల‌ను ధృవీక‌రించుకోకుండా....వాస్త‌వ అవాస్త‌వాల‌ను బేరీజు వేసుకోకుండా....వాటిని వెంట‌నే ఫార్వార్డ్ చేయ‌డం వ‌ల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత‌మంది రాజ‌కీయ‌ - మ‌త ప‌ర‌మైన విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు ఈ త‌ర‌హా మెసేజ్ ల‌ను ఫార్వార్డ్ చేయ‌గా....మ‌రి కొంత‌మంది అతి జాగ్ర‌త్త‌తో వాస్త‌వాల‌ను తెలుసుకోకుండా వాటిని వ్యాప్తి చేస్తున్నారు. ``చిన్న పిల్ల‌లను కిడ్నాప్ చేసే ముఠా మీ ప్రాంతంలో సంచ‌రిస్తోంది...జాగ్ర‌త్త‌`` అంటూ...కొద్ది నెల‌లుగా వాట్సాప్ లో ఓ సందేశం విప‌రీతంగా స‌ర్క్యులేట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే త్రిపుర‌ - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ - మ‌హారాష్ట్ర స‌హా దేశంలోని 9 రాష్ట్రాల్లో చాలా మంది అమాయ‌కుల‌ను ప్ర‌జ‌లు సామూహికంగా దాడి చేసి చంపేశారు.

తాజాగా, మ‌హారాష్ట్ర‌లో భిక్షాట‌న‌కు వ‌చ్చిన ఐదుగురు వ్య‌క్తుల‌ను కిడ్నాప‌ర్లుగా భావించిన స్థానికులు వారిని కొట్టి చంపారు. ఈ ఉదంతం దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ కావ‌డంతో కేంద్రం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. వాట్సాప్ - ఫేస్ బుక్ ల‌లో ఫేక్ న్యూస్ - వదంతులకు చెక్ పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అమాయకులపై ప్ర‌జ‌లు సామూహిక దాడులు చేయకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సైబర్‌ నేరాలు - సోషల్‌ మీడియాలో వదంతులు - నకిలీ వార్తల సమాచారం పై హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఓ ప్యానెల్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు - తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామని హోం శాఖ తెలిపింది. అటువంటి వారిపై తీసుకునే చ‌ర్య‌ల‌పై త్వ‌ర‌లోనే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది. అంత‌కుముందు...త‌ప్పుడు వార్త‌లు విస్త‌రించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వాట్సాప్ ను కేంద్రం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్రానికి వాట్సాప్ జ‌వాబిచ్చింది.