Begin typing your search above and press return to search.

హ్యాకర్లు హోంశాఖకు షాకులిస్తున్నారా?

By:  Tupaki Desk   |   15 Dec 2016 2:33 PM GMT
హ్యాకర్లు హోంశాఖకు షాకులిస్తున్నారా?
X
ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హోం శాఖకు తలనొప్పిగా మారుతున్నాయి. తమ ప్రమేయం లేకుండానే.. వివాదాస్పద సంస్థలకు సంబంధించిన లైసెన్స్ లను ఆటోమేటిక్ గా రెన్యువల్ అవుతున్న తీరు వారిని నివ్వెరపోయేలా చేస్తోంది.ఇలాంటి ఉదంతాలు ఈ మధ్యన తరచూ చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. దేశానికి పెద్ద తలకాయ లాంటి హోం శాఖకు సంబంధించిన సిస్టమ్స్ లోకి హ్యాకర్లు.. సైబర్ నేరగాళ్లు తరచూ చొచ్చుకుపోవటం.. ఊహించని రీతిలో నష్టం వాటిల్లేలా చేయటంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకునే పరిస్థితి.

తమకు చెందిన సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయా? అన్న సందేహం ఇప్పుడు హోం శాఖను పట్టి పీడిస్తోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఈ విషయమై తమకు సాయం చేయాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. మూడు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన లైసెన్స్ లు ఎలా రెన్యువల్ అయ్యాయో అర్థం కావటం లేదని చెబుతున్నారు. విదేశీ విరాళాలతో నడిచే ఈ ఎన్జీవోల వైఖరి.. వివాదాస్పదంగా ఉండటంతో వాటి లైసెన్స్ లను రద్దు చేశారు. అయితే.. అనుమానాస్పద రీతిలో వాటి లైసెన్స్ లు ఆటోమేటిక్ గా రెన్యువల్ కావటం పలు సందేహాలకు గురి చేస్తోంది.

ఇలాంటి పనులు ఎవరు చేశారు? ఎందుకు చేస్తున్నారు? గుర్తించని మరెన్ని అంశాల విషయంలో ఇలాంటి లోటుపాట్లు చోటు చేసుకుంటున్నాయన్నది ఇప్పుడు తేల్చాల్సిన అంశంగా చెబుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు లైసెన్స్ లు రద్దు చేసిన ఎన్జీవోల లైసెన్స్ లు పునరుద్ధరణకు గురి కావటంతో.. ఈ ఏడాది రెన్యువల్ అయిన 13 వేల లైసెన్స్ ల రెన్యువల్ ను ఆడిట్ చేయాలని హోం శాఖ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రీన్ పీస్.. తీస్తా సెతల్వాద్ సబ్రంగ్ ట్రస్ట్.. సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ సంస్థల లైసెన్స్ లు రెన్యువల్ కావటంతో పాటు.. వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ లైసెన్స్ కూడా ఇదే రీతిలో రెన్యువల్ కావటం హోం శాఖకు షాకుల మీద షాకులు తగులుతూ విస్మయానికి గురి చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/