Begin typing your search above and press return to search.

రాహుల్ భారతీయుడు కాదా..కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం

By:  Tupaki Desk   |   30 April 2019 9:01 AM GMT
రాహుల్ భారతీయుడు కాదా..కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం
X
ఏఐసీసీ అధినేత - ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారా.. ఒక వైపు పార్టీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఆయనకు పౌరసత్వం విషయం పెద్ద తలనొప్పిగా మారిపోయిందా.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.. తాజాగా మీరు భారతీయుడేనా అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాహుల్ కు పంపించిన నోటీసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. విదేశీ పౌరసత్వం ఆరోపణలపై వెంటనే సమాధానం చెప్పాలనేది ఆ నోటీసులు సారాంశం...

2003లో బ్రిటన్‌ లో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారనీ... 51సౌత్‌ గేట్ స్ట్రీట్ - వించెస్టర్ - హ్యాంప్‌ షైర్ ఎస్‌ వో23 9ఈహెచ్ అడ్రస్‌ తో ఉన్న సదరు కంపెనీకి మీరు ఓ డైరెక్టర్‌ గానూ - సెక్రటరీగానూ ఉన్నట్టు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి నుంచి మాకు ఫిర్యాదు అందిందని లేఖలో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు హోంశాఖలోని పౌరసత్వ వ్యవహారాల డైరెక్టర్ బీసీ జోషి సంతకంతో లేఖ విడుదలైంది. 2005 అక్టోబర్ 10 - 2006 అక్టోబర్ 31లో బ్యాకోప్స్ కంపెనీ దాఖలు చేసిన వార్షిక రిటర్నుల్లో రాహుల్ తన పుట్టిన తేదీ 1970జూన్ 10 గానూ - తాను బ్రిటీష్ పౌరుడిగాను పేర్కొన్నట్లు అమేథీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ఈ మధ్యనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే.. ఈ అంశాన్ని సుబ్రమణ్య స్వామి కూడా హోం శాఖ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 ఫిబ్రవరి 17 నాటి కంపెనీ డిసొల్యూషన్ దరఖాస్తులోనూ రాహుల్ బ్రిటీష్ పౌరుడుగానే ఉందని వాస్తవాలేంటో 15 రోజుల్లో స్పష్టం చేయాలని ఈ లేఖలో హోం శాఖ రాహుల్ గాంధీని ఆదేశించింది.

కొద్ది నెలల క్రితం మూడు రాష్ట్రాలు రాజస్థాన్ - ఛత్తీస్ ఘడ్ - మధ్యప్రదేశ్ లో విజయాలతో పాటు చాలా రాష్ట్రాల్లో మునుపటి కంటే పార్టీ పరిస్థితి మెరుగవ్వడంతో రాహుల్ తో పాటు పార్టీ శ్రేణుల్లో ఈ సారి ఎన్నికల్లో ఉత్సాహాంగా పనిచేసుకుంటూ పోతున్నాయి.. మధ్యలో ఇప్పుడు తెరపైకి వచ్చిన భారతీయత అంశం ప్రధానంగా ఆ పార్టీకి - రాహుల్ తీవ్ర చికాకు పెడుతోందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి.బీజేపీ సీనియర్ నేత - రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు రాహుల్ నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. 15 రోజుల్లోగా కాంగ్రెస్ చీఫ్ సమాధానం చెప్పాలని ఆదేశించింది.రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడంటూ ఆయనపై కొన్నేళ్లుగా స్వామి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబంపై తరచూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే సుబ్రహ్మణ్య స్వామి.. రాహుల్ పౌరసత్వం పై 2015లో తొలిసారి ఆరోపణలు లేవనెత్తారు.అది మొదలు తరచూ రాహుల్‌ పై ఇదే తరహా ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.

రాహుల్‌ కి నాలుగు పాస్‌ పోర్టులు ఉన్నాయనీ... అందులో ఒకటి రావుల్ విన్సీ పేరుతోనూ - ఆయన మతం క్రిస్టియన్‌ గానూ ఉందంటూ ఇటీవల స్వామి దుమారం రేపారు. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ రాహుల్ కు హోం శాఖ నోటీసుతో పాటు పౌరసత్వ అంశాన్ని బిజెపి బలంగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించడానికి నిరాకరిస్తున్న రాహుల్ గాంధీ గతంలో అంటే 2016లో ఒకసారి స్పందించారు.. స్వామి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనీ - ఆయన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. రాహుల్ కు నోటీసులపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది... కాంగ్రెస్ విజయసాధించ బోతోంది.. రాహుల్ ప్రధాని కాబోతున్నారు కాబట్టే మోడీ - అమిత్ షా కుట్రగా ఆ పార్టీ అభివర్ణించింది.. ఏదైనా.. పౌరసత్వ అంశం రాహుల్ కు కొంత ఇబ్బంది పెట్టేలానే కనిపిస్తోంది.. ఈ ఎన్నికల్లో రాహుల్ యూపీలో అమేథీ - కేరళలో వాయినాడ్ నుంచి బరిలోకి దిగారు..